BJP MPs Resigned Today :దేశంలోఇటీవలే జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించిన పది మంది ఎంపీలు తమ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరో ఇద్దరు ఎంపీలు త్వరలోనే తమ పదవుల నుంచి వైదొలగనున్నారు.
రాజీనామా పత్రాలను సమర్పించిన 10 మంది ఎంపీల్లో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, దియా కుమారి, రాజ్యవర్థన్ సింగ్ రాఠోడ్, రాకేశ్ సింగ్ సహా తొమ్మిది మంది లోక్‌సభ ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. వారంతా రాజీనామా చేసినట్లు అధికారులు చెప్పారు. కేంద్ర మంత్రి రేణుకాసింగ్, ఎంపీ మహంత్ బాలక్‌నాథ్ త్వరలో రాజీనామా చేయనున్నట్లు చెప్పారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో నూతన ముఖ్యమంత్రులను ఎన్నుకునే ప్రక్రియలో భాగంగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఎంపీలతో రాజీనామా చేయించినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
"మా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన తర్వాత నేను నా లోక్‌సభ ఎంపీ పదవికి రాజీనామా చేశాను. త్వరలోనే మంత్రివర్గం నుంచి కూడా వైదొలుగుతాను. తాజాగా జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో నార్సింగ్‌పుర్ నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా గెలుపొందాను"
- ప్రహ్లాద్ సింగ్ పటేల్, కేంద్ర మంత్రి
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 12 మంది ఎంపీల్లో పది మంది తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన అనంతరం తమ రాజీనామా లేఖలను లోక్‌సభ స్పీకర్‌కు అందజేశారు. ఆ సమయంలో వారితో పాటు జేపీ నడ్డా సైతం స్పీకర్ వద్దకు వెళ్లారు. స్పీకర్‌ను కలిసి రాజీనామాలు అందజేశారు ఎంపీలు.