భాజపాకు చెందిన ఇద్దరు ఎంపీలపై పోలీసుల కేసు నమోదు చేశారు. ఛార్టర్డ్ విమానం టేకాఫ్ చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో ఎంపీలు నిషికాంత్ దూబె, మనోజ్ తివారీపై ఈ కేసు నమోదైంది. ఎయిర్‌పోర్ట్ డీఎస్పీ ఫిర్యాదు మేరకు ఎంపీలు సహా 9 మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఇతరుల జీవితాలకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించడంతో పాటు, నియమాలు ఉల్లంఘించారన్న అభియోగాలు వారిపై మోపారు. ఝార్ఖండ్‌లోని దేవ్‌గఢ్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఏటీసీలోకి చొరబడి విమానం టేకాఫ్‌కు ఒత్తిడి.. భాజపా ఎంపీలపై కేసు - ఎంపీలపై కేసు
ఛార్టర్డ్ విమానం టేకాఫ్‌కు అనుమతి ఇవ్వాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులపై ఇద్దరు భాజపా ఎంపీలు ఒత్తిడి చేశారు. రాత్రి సమయంలో టేకాఫ్ చేసేందుకు అనుమతి లేదని, కానీ ఎంపీలు ఒత్తిడి తెచ్చి విమానంలో వెళ్లారని ఎయిర్‌పోర్ట్ డీఎస్పీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఝార్ఖండ్‌లోని దేవ్‌గఢ్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. ఆగస్టు 31న లోక్‌సభ ఎంపీ నిషికాంత్ దూబె, ఆయన కుమారులు, మరో ఎంపీ మనోజ్ తివారీ తదితరులు అనుమతి లేకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)లోకి ప్రవేశించారు. తమ ఛార్టర్డ్ విమానం టేకాఫ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభమైన విమానాశ్రయంలో రాత్రి పూట టేకాఫ్ చేసేందుకు అనుమతి లేదు. సూర్యాస్తమయానికి 30 నిమిషాల ముందు వరకు మాత్రమే టేకాఫ్ చేసేందుకు అనుమతిస్తారు. కానీ ఎంపీలు చీకటి పడ్డాక టేకాఫ్‌కు ఒత్తిడి తెచ్చి అనంతరం విమానంలో వెళ్లారని డీఎస్పీ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై శుక్రవారం రాత్రి దేవ్‌గఢ్ కలెక్టర్ మంజునాథ్ భజంత్రీ, నిషికాంత్ దూబె మధ్య ట్విటర్ వార్ నడిచింది. జాతీయ భద్రతా నియమాలను భాజపా ఎంపీ ఉల్లంఘించారంటూ మంజునాథ్ ట్వీట్ చేశారు. ఎంపీ, తన కుమారులు, అనుచర గణంతో ఏటీసీ రూమ్‌లోకి ప్రవేశించడాన్ని తప్పుబట్టారు. దీనిపై దూబె స్పందిస్తూ.. సీఎంకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ట్వీట్ చేశారు. అయినా ఈ అంశం దర్యాప్తు స్థాయిలో ఉందని, వాస్తవాలు బయటకొచ్చాకే మాట్లాడాలని సూచించారు. తనపై వ్యాఖ్యలు చేసే ముందు ఏవియేషన్ రూల్స్ చదువుకోవాలని సూచించారు. ఈ వ్యవహారంలో పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా, డీజీసీఏ జోక్యం చేసుకోవాలని అధికార జేఎంఎం డిమాండ్ చేసింది.