Taj mahal controversy: తాజ్‌మహల్‌లో మూసి ఉన్న 22 గదుల గుట్టు తేల్చాలని అలహాబాద్ హైకోర్టులో ఇటీవలే పిటిషన్ దాఖలు కావడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు రాజస్థాన్ భాజపా ఎంపీ, రాజకుటుంబానికి చెందిన దియా కుమారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్.. జైపుర్ రాయల్ ఫ్యామిలీకి చెందిన ఆస్తి అని, దాన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ పాలనలో బలవంతంగా లాక్కున్నారని తెలిపారు. తాజ్మహల్ తమదే అని నిరూపించేందుకు అవసరమైన డాక్యుమెంట్లు కూడా తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. అయితే దీనిపై కోర్టును ఆశ్రయించే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
" తాజ్ మహల్ ఉన్న చోటు మొదట జైపుర్ రాజ కుటుంబానికి చెందింది. షాజహాన్కు ఆ ప్రదేశం నచ్చి బలవంతంగా లాక్కున్నారు. అప్పట్లో చట్టాలు, కోర్టులు లేవు. ప్రజలు ఎదిరించాలంటే భయపడేవారు. తాజ్ మహల్ ఉన్న చోటును తీసుకున్నందుకు షాజహాన్ కొంత పరిహారం ఇచ్చారని విన్నాను. తాజ్ మహల్ స్థలం మాదే అనేందుకు మా వద్ద పత్రాలున్నాయి. కోర్టు అడిగితే వాటిని సమర్పిస్తాం"