కర్ణాటక చెన్నగిరి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే, సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ ఛైర్మన్ మాడాళు విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ కుమార్ లోకాయుక్త అధికారులకు చిక్కారు. గురువారం తన కార్యాలయంలో రూ. 40 లక్షల లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. నిందితుడితో పాటు డబ్బులు ఇచ్చేందుకు వచ్చిన అతడి బంధువు సిద్ధేశ్, అకౌంటంట్ సురేంద్ర, నికోలస్, గంగాధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రశాంత్ కుమార్ ఇంట్లో శుక్రవారం ఉదయం 4 గంటల వరకు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ. 6 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కాగా, కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు ఇలా పట్టుబడటం.. ప్రతిపక్షాలకు ఓ ఆయుధంగా మారింది. దీంతో ప్రశాంత్ కుమార్ తన తండ్రికి బదులు కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటున్నారంటూ అధికార పక్షంపై విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు.
లోకాయుక్త అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
ప్రశాంత్ కుమార్.. బెంగళూరు వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డులో చీఫ్ అకౌంటంట్గా పనిచేస్తున్నారు. కాగా, ఆయన తండ్రి, చెన్నగిరి ఎమ్మెల్యే మాడాళు విరూపాక్షప్ప కర్ణాటక సోప్స్ అండ్ డిటెర్జెంట్ లిమిటెడ్ కంపెనీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీ ప్రముఖ మైసూర్ సాండల్ సోప్ అనే బ్రాండ్ సబ్బులను తయారు చేస్తోంది. సబ్బు, ఇతర డిటెర్జెంట్ల తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు సప్లై చేసే కాంట్రాక్టు కావాలంటే రూ. 80 లక్షల లంచం ఇవ్వాల్సిందిగా ఓ వ్యాపారిని డిమాండ్ చేశారు ప్రశాంత్ కుమార్. దీంతో బాధితుడు వారం రోజుల క్రితం లోకాయుక్త అధికారులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పాడు. అనంతరం బాధితుడితో కలిసి అధికారులు ప్రశాంత్ కుమార్‌కు వల పన్నారు. రూ. 40 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే, గతేడాది అవినీతి నిరోధక శాఖను రద్దు చేసి.. దానికి బదులు లోకాయుక్తను ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం.