కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సహా తమిళనాడు, బంగాల్, కేరళ, అసోం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులను ఎంపిక చేసే కసరత్తును ప్రారంభించనుంది భాజపా. ఈ వారమే ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మార్చి 4న ఈ సమావేశం జరుగుతుందని పేర్కొన్నాయి.
భాజపా కేంద్ర ఎన్నికల కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చవాన్ ఉన్నారు.
పుదుచ్చేరి(33), తమిళనాడు(234), బంగాల్(294), కేరళ(140), అసోం(126) అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారమే ప్రకటించింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. బంగాల్లో 8 విడతల్లో, అసోంలో మూడు విడతల్లో నిర్వహించనున్నారు. మే 2న ఫలితాలు వెలువడుతాయి.