Uttarakhand Chief minister: ఉత్తరాఖండ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే 11 రోజుల ఉత్కంఠకు తెరపడింది. పుష్కర్ సింగ్ ధామి మరోమారు పగ్గాలు అందుకోనున్నారు. సోమవారం సాయంత్రం దెహ్రాదూన్‌లో జరిగిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా కలిసి ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి భాజపా కేంద్ర పరిశీలకులు రాజ్‌నాథ్ సింగ్, మీనాక్షి లేఖీ, రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జి ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు.
పుష్కర్ సింగ్ ధామి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఖటిమా నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ముఖ్యమంత్రి ఎంపికపై భాజపా అధిష్ఠానం సందిగ్ధంలో పడిపోయింది. పార్టీ విజయానికి ధామినే కారణమని, ఆయనకే పగ్గాలు అప్పగించాలని కొందరు నేతలు సూచించారు. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రి రేసులో పుష్కర్ సింగ్ సహా ఎమ్మెల్యేలు సత్పాల్ మహరాజ్, ధన్ సింగ్ రావత్, రాజ్యసభ ఎంపీ అనిల్ బలుని, కేంద్ర మాజీ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ పేర్లు తెరపైకి వచ్చాయి. చివరకు ధామికే జై కొట్టారు ఎమ్మెల్యేలు.