తెల్లని గడ్డం పెంచుకున్నంత మాత్రాన ఎవరూ నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ అయిపోరని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యంగ్యాస్త్రం సంధించారు. ఇటీవల కాలంలో ప్రధాని మోదీ తెల్లని గడ్డంతో కనిపిస్తోన్న నేపథ్యంలో ఆయన పేరెత్తకుండానే బుధవారం బంగాల్ ఎన్నికల సభల్లో ఆమె ఈ వ్యాఖ్య చేశారు. భాజపా నేతలు కాషాయ వస్త్రాలు ధరిస్తున్నా.. ఆ రంగుకు ఉన్న ప్రాముఖ్యం గురించి వారికి తెలియదన్నారు.
'కాషాయమంటే త్యాగానికి ప్రతీక. కమలనాథులు ఆ రంగు వస్త్రాలు ధరిస్తున్నా వారి అసలు ఉద్దేశం మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే' అని ఆరోపించారు. తాను ప్రచారంలో పాల్గొనకూడదనే ఉద్దేశంతోనే కాలికి గాయమయ్యేలా చేశారని దుయ్యబట్టారు.
ప్రజాస్వామ్యంలో రాజకీయ పోరాటాలు సాధారణమే. అయితే ప్రజాస్వామ్యాన్ని అణిచివేయాలనుకోవడం సరైనది కాదని మమత అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తన ఎన్నికల ప్రచారంపై ఈసీ విధించిన నిషేధంపై వ్యాఖ్యానించారు.