తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళ 'స్థానిక' పోరులో భాజపా లెక్క తప్పిందా? - BJP leaders resent the unexpected Kerala polls verdict

దక్షిణాదిన భారతీయ జనతా పార్టీ వేగంగా పుంజుకుంటోంది. గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల్లో సాధించిన విజయోత్సాహంతో తాజాగా కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని భావించింది. ఆయితే కమలదళం అనుకున్న స్థాయిలో ఎందుకు ప్రభావం చూపలేకపోయింది? మోదీ చరిష్మాను ఉపయోగించుకోవడంలో పార్టీ విఫలమైందా?

BJP leaders resent the unexpected Kerala polls verdict
కేరళ 'స్థానిక' పోరులో భాజపాకు ఎదురుదెబ్బ

By

Published : Dec 17, 2020, 5:07 PM IST

"తిరువనంతపురంలో విజయం సాధిస్తాం...మేయర్​ పీఠాన్ని అధిరోహిస్తాం...ప్రధాని మోదీ కేరళ రాజధానికి వచ్చినప్పుడు భాజపా మేయరే స్వాగతం పలుకుతారు"...

ఇవి కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాజపా నినాదాలు.

అయితే ఇలాంటి అనేక వ్యాఖ్యలు నినాదాలకే పరిమితం అయ్యాయి. కమలదళం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేరళ రాజధాని తిరువనంతపురం సహా అన్ని కార్పొరేషన్లలో ప్రభావం చూపలేకపోయింది. గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల తరహాలో ప్రచారంలో దూకుడుగా వ్యవహరించినా.. ఓటర్ల మనసును గెలుచుకోలేపోయింది.

కేరళలో 941 గ్రామ పంచాయతీలు, 152 బ్లాక్​ పంచాయతీలు, 14 జిల్లా పంచాయతీలు(జెడ్​పీ), 86 మునిసిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి.

గంపెడాశలతో...

ఇప్పుడిప్పుడే దక్షిణాదిన పట్టు బిగిస్తున్న భాజపా.. కమ్యూనిస్టు కోట కేరళలోనూ సత్తా చాటాలని భావించింది. కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగారు నాయకులు. అయితే నాయకత్వం వ్యూహాత్మక తప్పిదాల వల్ల పార్టీ అనుకున్న స్థాయిలో బలాన్ని ప్రదర్శించలేకపోయింది. పార్టీ కీలక నేతలే ఓటమిపాలు కావల్సి వచ్చింది.

పార్టీకి రాష్ట్రస్థాయిలో కీలక నేతగా ఉన్న బి.గోపాలకృష్ణన్ త్రిస్సూర్​ కార్పొరేషన్​లో, తిరువనంతపురం జిల్లా పంచాయతీ స్థానానికి పోటీ పడ్డ మాజీ అధ్యక్షుడు కె.సురేష్ ఓడిపోవడం పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పుకోవాలి. అలాగే కొచ్చి, కొల్లం, కోజికోడ్ కార్పొరేషన్లలో ఎక్కువ వార్డులు గెలుస్తామని ధీమాగా భాజపాకు ఎదురుగాలే వీచింది.

ప్రకటనలకే పరిమితం

స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం భాజపా ప్రకటనలకే పరిమితమైంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, మోదీ చేస్తున్న అభివృద్ధి, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం అంశాలను నాయకులు బలంగా ఓటర్లలోకి తీసుకెళ్లలేదని స్పష్టమవుతోంది. అందుకే కమల దళానికి కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది.

కొంత ఊరట..

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా అనుకున్న స్థాయిలో ప్రభావాన్ని చూపించలేకపోయింది. 6 కార్పొరేషన్లలో ఒక్క స్థానాన్నీ గెలుచుకోలేకపోయింది. జిల్లా పంచాయతీ స్థానాలు అన్నింట్లో ఓటమి పాలైంది. 152 బ్లాక్​ పంచాయతీల్లో ఒక్కటి కూడా దక్కించుకోలేకపోయింది భాజపా.

అయితే మునిసిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో మాత్రం కాషాయదళం గత ఎన్నికల కంటే కాస్త మెరుగైన ప్రదర్శన కనబర్చింది.

గత ఎన్నికల్లో ఒక్క పాలక్కడ్​ మునిసిపాలిటీలోనే భాజపా గెలిచింది. అయితే ఈ సారి పాలక్కడ్ స్థానాన్ని నెలబెట్టుకున్న కమల దళం.. అదనంగా పండలం మునిసిపాలిటీనీ గెలుచుకోగలిగింది.

గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 13 స్థానాలను మాత్రమే దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ.. ఈ సారి 26 పంచాయతీల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో రెండు మునిసిపాలిటీలు, 26 పంచాయతీల్లోని విజయాలే భాజపాకు కాస్త ఊరట కలిగించే అంశాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఫలితాలు వెలువడిన తర్వాత ఓటమిపై భాజపా స్పందించింది. తమను ఓడించడానికి ఎల్​డీఎఫ్​తో యూడీఎఫ్​ జతకట్టిందని ఆరోపించింది.

ABOUT THE AUTHOR

...view details