Sushil Modi On Nitish Kumar : మహారాష్ట్రలో శివసేన, తర్వాత ఎన్సీపీలో వచ్చిన తిరుగుబాటు.. ఇక జేడీయూలోనూ వస్తుందని భారతీయ జనతా పార్టీ నాయకులు.. చెబుతున్నారు. జేడీయూలో తిరుగుబాటు ఛాయలు కనిపిస్తున్నాయని.. చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు చేస్తున్నారని.. బీజేపీ ఎంపీ సుశీల్ మోదీ చెప్పారు. నీతీశ్ కుమార్ వారసుడిగా ఆర్జేడీ నాయకుడు తేజశ్వీ యాదవ్‌ను అంగీకరించేందుకు జేడీయూ నేతలు సిద్దంగా లేరని వెల్లడించారు. రాహుల్ గాంధీని అఖిలపక్ష నాయకుడిగా ఒప్పుకునేందుకు కూడా జేడీయూ నాయకులు సిద్ధంగా లేరని చెప్పారు.
అయితే.. JDU తిరుగుబాటుదారులను బీజేపీ స్వీకరిస్తుందా అనే ప్రశ్నకు మాత్రం.. ఆయన సమాధానం చెప్పలేదు. నీతీశ్ కుమార్.. తమ తలుపు వద్దకు వచ్చి బతిమలాడినా బీజేపీ ఆయనతో మళ్లీ జతకట్టదని సుశీల్ మోదీ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో.. జేడీయూ చీలిపోవచ్చని వెల్లడించారు. ఆ పార్టీ నాయకులు చాలా మంది తమతో సంప్రదింపులు జరుపుతున్నారని.. సుశీల్ కుమార్ మోదీ తెలిపారు.
జేడీయూ మాత్రం.. బీజేపీ అంచనాలను కొట్టిపారేసింది. ఎన్సీపీలో సంక్షోభానికి కారణం భారతీయ జనతా పార్టీనే అని విమర్శించింది. బీజేపీ వైఖరి సిగ్గుచేటని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగీ దుయ్యబట్టారు. ఎన్సీపీలో సంక్షోభం మహారాష్ట్రకు మాత్రమే పరిమితమని.. ఆయన అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఆ ప్రభావం ఉండదని చెప్పారు. అజిత్ పవార్ వైపునకు వెళ్లిన ఎమ్మెల్యేలను.. కేంద్ర దర్యాప్తు సంస్థలతో భయపెట్టారని త్యాగీ ఆరోపించారు. తమ నాయకుడు నీతీశ్ కుమార్... విపక్షాలను ఏకం చేయడం చూసి భయపడిన బీజేపీ ఈ చర్యకు ఉపక్రమించిందని విమర్శించారు. విపక్షాల ఐక్యతపై.. ఎన్సీపీలో తిరుగుబాటు ప్రభావం.. ఏమాత్రం ఉండబోదని త్యాగీ చెప్పారు. విపక్షాల ఐక్యతకు తమ పార్టీ కృషి కొనసాగిస్తుందని ఆయన వివరించారు.
అది రాహుల్ గాంధీ అహంకారానికి పరాకాష్ఠ : సుశీల్ మోదీ
అంతకుముందు కొన్నాళ్ల క్రితం.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత వేటుపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు సుశీల్ కుమార్ మోదీ. 'రాహుల్ గాంధీ కంటే ముందు.. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత వంటి ప్రముఖులు కూడా అనర్హత వేటుకు గురయ్యారు. ఇదేం కొత్తం విషయం కాదు. చట్టాలకు ఎవరూ అతీతులు కారు. కాంగ్రెస్ పార్టీయే నిజం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. ప్రజాస్వామ్యంలో వెనుకబడిన కులాల ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేయవచ్చా?.. వారికి ఉన్నత స్థానాల్లో ఉండే హక్కు రాజ్యాంగం కల్పించలేదా?. ప్రధాని మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు. అయినప్పటికీ క్షమాపణలు చెప్పకపోవడం రాహుల్ అహంకారానికి పరాకాష్ఠ. ఓబీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోదీ.. ప్రధాని కావడం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతున్నాయి.' అని సుశీల్ మోదీ అన్నారు.