కర్ణాటకలో భాజపా యువనేత ప్రవీణ్ హత్య మరువక ముందే ఆ పార్టీకి చెందిన మరో నేత దారుణ హత్యకు గురయ్యారు. విపిన్ కుమార్ సింగ్ అనే భాజపా నేతను దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన బిహార్‌లోని మాధేపుర జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఇదీ జరిగింది..: షాపుర్ పంచాయత్‌లోని ఓ కోపరేటివ్ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్న విపిన్ కుమార్ (59).. శుక్రవారం సాయంత్రం కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్నారు. అప్పటికే తిక్కర్ టోలామోర్ ప్రాంతంలో మాటు వేసిన ఐదుగురు దుండగులు బైక్‌లపై కారును వెంబడించి విపిన్పై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనాస్థలి నుంచి పోలీసులు ఆరు బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.