కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఆయన కుటుంబసభ్యులను హత్య చేసేందుకు బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు. చిత్తాపుర్ బీజేపీ అభ్యర్థి ఆడియో టేపుల ద్వారా ఈ విషయం స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల భాజపా ఎమ్మెల్యే మదన్ దిలావర్ కూడా ఖర్గేను హత్య చేస్తామని హెచ్చరించారని వెల్లడించారు. ఈ విషయంలో బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటోందని ఆయన ప్రశ్నించారు.
"ఓటమి భయంతో బీజేపీ ఏ స్థాయికి దిగజారిందంటే.. ప్రధాని మోదీ, సీఎం బొమ్మై అనుచరుడు, చిత్తాపుర్ బీజేపీ అభ్యర్థి.. ఖర్గే, ఆయన కుటుంబసభ్యుల హత్యకు కుట్ర పన్నినట్లు ఆడియో టేపుల ద్వారా దొరికిపోయారు. కర్ణాటకలోని ఓ దళిత కుటుంబంలో, పరిశ్రమలో కూలీ పనిచేసుకుని బతికే వారి ఇంటిలో పుట్టిన మల్లిఖార్జున ఖర్గే.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎలా అయ్యారని.. బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. ఇది కర్ణాటక స్వాభిమానాన్ని హత్య చేసేందుకు జరిగిన కుట్ర. ఖర్గే హత్యకు కుట్ర విషయంలో మోదీ, కర్ణాటక పోలీసులు, ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై, ఎన్నికల సంఘం మౌనంగా ఉన్నా.. కర్ణాటక ప్రజలు మౌనంగా ఉండరు."
- రణదీప్ సూర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
ఖర్గేను హత్య చేసేందుకు కుట్ర పన్నారన్న కాంగ్రెస్ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై చెప్పారు. అది నిజమని తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఖర్గే హత్యపై బీజేపీ అభ్యర్థి ఆడియో టేపుల వ్యవహారంలోనూ నిజానిజాలు తేల్చాల్సి ఉందన్నారు. "ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం.మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిస్తాం." అని బొమ్మై తెలిపారు.