క్రిమినల్ కేసుల్లో తప్పుడు ఫిర్యాదులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును భాజపా నేత ఒకరు కోరారు. అటువంటి తప్పుడు విచారణల వల్ల ఇబ్బందులు పడ్డవారికి పరిహారం చెల్లించేలా నిర్దేశించాలని కోరారు. ఈ మేరకు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన భాజపా నేత కపిల్ మిశ్రా... ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం, కేంద్రాన్ని ప్రతివాదులుగా పేర్కొన్నారు.
జనవరి 28న అలహాబాద్ హైకోర్టు ఓ రేప్ కేసులో ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కపిల్ మిశ్రా ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విష్ణు తివారీపై 2000 సంవత్సరంలో ఓ మహిళ అత్యాచార ఆరోపణలు మోపింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు విష్ణు తివారీని నిర్దోషి అని తేల్చింది. భూవివాదం కారణంగానే సదరు మహిళ.. తివారీపై తప్పుడు ఆరోపణలు మోపిందని పేర్కొంది. 2000 సెప్టెంబర్ 16న తివారీని ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు.