BJP Leader Killed :ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు మూడు రోజుల ముందు బీజేపీ నేత హత్యకు గురికావడం కలకలం రేపింది. నారాయణపుర్ జిల్లాలోని కౌశల్నార్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రతన్ దూబేను మావోయిస్టులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. శనివారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. అయితే ఈ హత్యపై దర్యాప్తు కోసం ఓ బృందం ఘటనాస్థలానికి వెళ్లిందని నారాయణపుర్ ఎస్పీ పుష్కర్ శర్మ పేర్కొన్నారు.
స్థానికుల కథనం ప్రకారం..
రతన్ దూబే(57) బీజేపీ నారాయణపుర్ జిల్లా విభాగానికి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఆయన ధోడై ప్రాంతంలోని జిల్లా పంచాయతీ సభ్యుడిగా కూడా ఉన్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారం కోసం ఆయన శనివారం జిల్లాలోని కౌశల్నార్ గ్రామానికి వెళ్లారు. ప్రచారం ముగిసిన తర్వాత సాయంత్రం ఇంటికి పయనమయ్యారు. అప్పటికే గ్రామంలోని శివారు ప్రాంతంలో కాపుకాసుకొని ఉన్న కొందరు మావోయిస్టులు దూబేపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో వారి నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో కింద పడిపోయారు. ఇదే అదనుగా భావించిన నక్సలైట్లు.. కింద పడిపోయిన అతడిని పట్టుకొని మారణాయుధాలతో అతికిరాతకంగా నరికి హత్యచేశారు. దీంతో ఆయన అక్కడిక్కక్కడే ప్రాణాలు విడిచారు. ఈ పరిణామంతో అక్కడి స్థానికులు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 7న తొలి, 17న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడవుతాయి.
బీజేపీ నేతలే టార్గెట్గా..
గతనెలలో మరో బీజేపీ నేత బిర్జూ తారమ్ కూడా మావోయిస్టుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు. మొహ్లా మాన్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ హత్యకు బాధ్యత వహిస్తూ నక్సలైట్లు ప్రకటించారు. పోలీసు ఇన్ఫార్మర్గా భావించి హత్య చేసినట్లు చెప్పారు. 8 నుంచి 10 మంది నక్సలైట్లు కలిసి బీర్జూను హత్య చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు.