నాయకులై ముందుకు నడిపిస్తారని విశ్వాసం కలిగించినప్పుడే సినీ తారలకు జనం ఓట్లు వేస్తారని ప్రముఖ నటి భాజపా నాయకురాలు ఖుష్బూ సందర్ చెప్పారు. ఈనాడు ప్రతినిధితో మాట్లాడిన ఆమె మరిన్ని కబుర్లు పంచుకున్నారు.
గెలుపుపై సందేహం లేదు
థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో ప్రచారానికి మంచి స్పందన కనిపిస్తోంది. నా విజయంపై సందేహం ఏమాత్రం లేదు. తమిళనాడుకు వచ్చి 35 ఏళ్లయింది. ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఎన్నికల బరిలోకి దిగాను. రాజకీయాల్లో నిబద్ధత చాలా అవసరం. సినిమాల్లో విజయవంతమయ్యే వారంతా రాజకీయాల్లో రాణిస్తారని చెప్పలేం. అభిమానులను ఓటు బ్యాంకుగా చూడకూడదు. ఎన్నికల్లో పోటీ చేసే సినీతారలు.. సమస్యలను పరిష్కరించగల సత్తా ఉన్నవారమని ప్రజల్లో విశ్వాసం కల్పించాలి. నేను దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటాను. సమస్యలను పరిష్కరిస్తానన్న నమ్మకం ప్రజల్లో ఉంది.
భాజపా నాయకురాలు ఖుష్బూ సుందర్ ఆత్మగౌరవం ముఖ్యం
నేను తొలుత డీఎంకేలో ఉన్నాను. తర్వాత కాంగ్రెస్‌లో చేరాను. తగిన గౌరవం దక్కకపోవడం వల్లే వాటి నుంచి బయటికొచ్చాను. నాకు ఆత్మగౌరవం ముఖ్యం. దానికి భంగం కలిగితే సహించబోను. నాకు ప్రచార యావ లేదు. పత్రికల మొదటి పేజీల్లో ఫొటోలు చూసుకోవడానికి కాదు రాజకీయాల్లోకి వచ్చింది. నేనేమీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయను. నా అభిప్రాయాలు చెబుతానంతే. కొందరి వివాదాస్పద వైఖరి కారణంగా ఆ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.
పళని పాలన బాగుంది
తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం గత పదేళ్లలో పరిపాలనాపరంగా అనేక విజయాలు సాధించింది. ఆ విజయాలే మా కూటమిని గెలిపిస్తాయి. సీఎం పళనిస్వామి పాలన బాగుంది. నిరంతర కృషితో రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టారు. వాషింగ్ మెషీన్, సోలార్ స్టవ్ ఇస్తామంటూ మేనిఫెస్టోలో మేం ఇచ్చిన హామీలపై చర్చ అనవసరం. సోలార్ స్టవ్ పర్యావరణానికి ప్రయోజనకరం. ఈ రోజుల్లో వాషింగ్ మెషీన్ లేకపోతే ఇళ్లకు పనిమనుషులూ రావట్లేదు!
వాళ్లు దేవుళ్లు!
ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్ వంటి మహామహుల సినిమాలు సందేశాత్మకంగా ఉండేవి. తమిళ సినీరంగంపై కరుణానిధి తనదైన ముద్ర వేశారు. వారంతా ప్రజలకు దేవుళ్లుగా కనిపించారు. వాళ్లు రాజకీయాల్లో రాణించేందుకు అప్పటి పరిస్థితులు కూడా కొంత కలిసొచ్చాయి. ప్రస్తుతం అలాంటి ధోరణి పెద్దగా కనిపించట్లేదు. విజయ్‌కాంత్ స్థాపించిన డీఎండీకేకు మొదట్లో మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత నుంచి రాజకీయాల్లోకి వచ్చినవారిలో నిబద్ధత అంతగా కనిపించడం లేదు. కమల్‌హాసన్ పెట్టిన పార్టీ ప్రభావం తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.
మంచి పాత్ర వస్తే.. నటనకు సిద్ధమే
నేను సినీ రంగానికి దూరమె 21 ఏళ్లయింది! మధ్యలో ఐదారు చిత్రాల్లో నటించాను. మంచి పాత్ర వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నా. ఓ తెలుగు చిత్రంలో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయి. రాజకీయాల్లో కొనసాగేందుకు భర్త సుందర్ సహా కుటుంబం నుంచి పూర్తి సహకారం లభిస్తోంది. నాకు ఇద్దరు కుమార్తెలు. పెద్దామ్మాయి లండన్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తోంది. రెండో అమ్మాయి చెన్నైలోనే 12వ తరగతి చదువుతోంది.
- చెన్నై నుంచి 'ఈనాడు' ప్రత్యేక ప్రతినిధి.
ఇదీ చదవండి:గోద్రాలో భాజపాను గద్దె దించిన మజ్లిస్ పార్టీ