తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భాజపా హామీలన్నీ అబద్ధాలే... గద్దెదిగక తప్పదు' - యూపీ ఎన్నికలు 2022

BJP jumla promises: ఉత్తర్​ప్రదేశ్ గత ఎన్నికల సందర్భంగా భాజపా ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని తేలాయని సమాజ్​వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఈసారి భాజపాకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. అధికారంలోకి వస్తే చేపట్టనున్న కార్యక్రమాల గురించి వివరించారు.

BJP's every promise was a 'Jumla', says Akhilesh Yadav
Akhilesh Yadav

By

Published : Jan 29, 2022, 10:09 AM IST

Updated : Jan 29, 2022, 10:19 AM IST

BJP jumla promises: ఉత్తర్​ప్రదేశ్​లో భాజపా ప్రభుత్వంపై సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ విమర్శలు గుప్పించారు. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు భాజపా ఇచ్చిన వాగ్దానమేదీ నెరవేరలేదని అన్నారు. అవన్నీ ఇప్పుడు వాగ్దానాలన్నీ అబద్ధాలేనని తేలాయని ఆరోపించారు. ఆర్ఎల్​డీ అధినేత జయంత్ చౌధరితో కలిసి శుక్రవారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన అఖిలేశ్ యాదవ్.. భాజపా తప్పుడు ప్రచారాలు చేసుకుంటోందని మండిపడ్డారు.

BJP Akhilesh yadav news

"గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోను భాజపా చదువుకోవాలి. అందులో ఎన్ని హామీలు నెరవేరాయి? భాజపా ఇచ్చిన ప్రతి వాగ్దానం అబద్ధమేనని తేలింది. ఇప్పుడు కూడా తప్పుడు ప్రచారాలు చేసుకుంటోంది. ఈ ఎన్నికల్లో భాజపాకు ఓటమి తప్పదు. మా కూటమి భాజపాను గద్దె దించుతుంది."

-అఖిలేశ్ యాదవ్, సమాజ్​వాదీ పార్టీ అధినేత

UP election 2022: ఉత్తర్​ప్రదేశ్​లో అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి 300 యూనిట్ల కరెంట్ ఉచితంగా అందిస్తామని అఖిలేశ్ ప్రకటించారు. వ్యవసాయానికీ ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. 'రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తాం. వ్యవసాయదారుల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తాం. సమాజ్​వాదీ పెన్షన్లను తిరిగి ప్రవేశపెడతాం. గతంలో మాదిరిగానే ల్యాప్​టాప్​లు పంచిపెడతాం' అని హామీలు ప్రకటించారు.

ఆర్​ఎల్​డీ కోసం ఎన్​డీఏ తలుపులు తెరిచే ఉన్నాయన్న భాజపా వ్యాఖ్యలను తిప్పికొట్టారు. పశ్చిమ యూపీలో భాజపాకు జయంత్ సింగ్ తలుపులు మూసేశారని వ్యాఖ్యానించారు.

జయంత్ సింగ్ సైతం భాజపా ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఇతర పార్టీలకు ఆహ్వానం పలుకుతోందంటే రాష్ట్రంలో భాజపా పరిస్థితి దిగజారిందని అర్థమవుతోందని అన్నారు.

'హెలికాప్టర్ అడ్డుకున్నారు..'

అంతకుముందు, ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్​నగర్​లో ఎన్నికల కార్యక్రమానికి వెళ్లాల్సిన తన హెలికాప్టర్​ను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందని అఖిలేశ్​ ఆరోపించారు. దీంతో దిల్లీలోనే చిక్కుకుపోయానని చెప్పారు. ఈ మేరకు హెలికాప్టర్​తో ఉన్న ఫొటోను ట్విట్టర్​లో షేర్​ చేశారు. అధికారంలో ఉన్న భాజపా ఎన్నికల వేళ ఏం చేయడానికైనా వెనకాడటం లేదని దుయ్యబట్టారు. 'నా కంటే ముందు భాజపా నేతలు హెలికాప్టర్​లో వెళ్లారు. ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ అధికారులు నాతో చెప్పారు. కానీ నన్ను మాత్రం రెండు గంటలు ఎదురుచూసేలా చేశారు. భాజపా ఏమైనా చేసుకోవచ్చు. ఉత్తర్​ప్రదేశ్ ప్రజలు వారికి గట్టిగా బుద్ధి చెబుతారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు అఖిలేశ్. ఎన్నికల సంఘం ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

Last Updated : Jan 29, 2022, 10:19 AM IST

ABOUT THE AUTHOR

...view details