BJP JDS Alliance Karnataka : కర్ణాటకలో జేడీఎస్, బీజేపీ పొత్తుపై స్పందించారు జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ. 2024 లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 'నేను చాలా స్పష్టంగా చెబుతున్నా. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం. జేడీఎస్ కార్యకర్తలతో సంప్రదించి.. పార్టీ బలంగా చోట్ల మాత్రమే అభ్యర్థులను లోక్‌సభ ఎన్నికల్లో బరిలో నిలుపుతాం' అని దేవెగౌడ చెప్పారు. విపక్షాల కూటమికి ఆహ్వానం అందకపోవడంపై ప్రశ్నించగా.. కర్ణాటక కాంగ్రెస్‌లోని ఓ వర్గం నేతలు తమను అడ్డుకున్నారని చెప్పారు.
"2024 లోక్‌సభ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ఒక స్థానమా లేదా రెండా? ఆరు సీట్లు గెలుస్తామా అన్నది పక్కనపెడితే.. వచ్చే ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా ఒటంరిగానే పోటీ చేస్తాం. ఈ పరిస్థితులపై పార్టీలో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటాం."
--దేవెగౌడ, జేడీఎస్ అధినేత
బీజేపీతో కలిసి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తమ పార్టీ పనిచేస్తుందని ఇటీవలే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామిచెప్పారు. కర్ణాటకలో బీజేపీతో కలిసి ప్రతిపక్షంగా పనిచేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. బీజేపీతో జట్టు కట్టే విషయంలో.. తుది నిర్ణయం తీసుకునే అధికారం జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడతనకు అప్పగించినట్లు తెలిపారు. దీంతో వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్-బీజేపీ పొత్తు ఉంటుందని ఊహాగానాలు వచ్చాయి. తాజాగా దేవెగౌడ చేసిన వ్యాఖ్యలతో పొత్తు ఖరారు కానట్లు తెలుస్తోంది.