జనతా దళ్ సెక్యులర్(జేడీఎస్)ను భాజపాలో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలను ఆ రెండు పార్టీల నేతలు ఖండించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భాజపా-జేడీఎస్ మధ్య పొత్తు లేదా విలీనం అనివార్యమనే వార్తలను సీఎం యడియూరప్ప, కూమారస్వామి కొట్టిపారేశారు.
అరవింద్ వ్యాఖ్యలతో రాజుకున్న అగ్ని..
ప్రస్తుతం దేశమంతా ప్రధాని నరేంద్ర మోదీ గాలి వీస్తోందని.. రాష్ట్రంలోనూ రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశాలు ఉన్నాయని కర్ణాటక భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరవింద్ లింబావలి వ్యాఖ్యానించారు. దీంతో జేడీఎస్‌ను భాజపాలో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు గుప్పుమన్నాయి. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కేంద్రంగా భాజపా-జేడీఎస్ మధ్య పొత్తు, విలీనం వార్తలు చక్కర్లు కొట్టాయి.
సంక్రాతి తరవాత...?
ఈ వ్యవహారంపై కర్ణాటక మీడియాలో అనేక ఊహాగానాలు ప్రచారమయ్యాయి. సంక్రాతి తరువాత భాజపా-జేడీఎస్ భాగస్వామ్యం ఏర్పడొచ్చని.. ఉగాది నుంచి కుమారస్వామి నేతృత్వంలో పొత్తు కొనసాగుతుందనే వార్తలతో.. కర్ణాటక రాజకీయాల్లో పెను దుమారం చెలరేగింది.
గతవారం కర్ణాటక శాసన మండలిలో జరిగిన ఘటన, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్‌ను ఆయన స్థానం నుంచి బలవంతంగా కిందకు లాక్కెళ్లడంపై మాత్రమే జనతాదళ్ మాకు మద్దతుగా నిలిచింది. జేడీఎస్ ఎమ్మెల్యే ఒకరు భాజపాలో చేరుతున్నారా? లేక మొత్తం పార్టీనే విలీనమవుతుందా? అనేది ఇప్పటికీ సందిగ్ధమే. ప్రస్తుతానికి మీడియాలో వచ్చేవన్నీ అవాస్తవాలే.
-యడియూరప్ప, కర్ణాటక సీఎం