ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో (UP Election 2022) విజయం భారతీయ జనతా పార్టీదేనని ఏబీపీ-సీఓటర్-ఐఏఎన్ఎస్ స్నాప్ పోల్‌లో (ABP Cvoter opinion poll) వెల్లడైంది. 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో (UP Election 2022) భాజపా తన మిత్ర పక్షాలతో కలిసి 217 సీట్లు దక్కించుకుంటుందని సర్వే తెలిపింది. 2017లో గెలిచిన 325 సీట్ల కంటే 108 స్థానాలు తక్కువ అని వివరించింది. ఈ స్థానాలను.. గణనీయంగా పుంజుకుంటున్న సమాజ్‌వాదీ పార్టీ దక్కించుకోనుందని వెల్లడించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో (UP Election 2022) ప్రధానంగా భాజపా, ఎస్పీ మధ్యే పోటీ నెలకొందని పేర్కొంది. సమాజ్‌వాదీ పార్టీ 156 సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని తెలిపింది.
అయితే, భాజపా ఓట్ల శాతంలో (UP Election 2022) పెద్దగా తేడా ఉండదని సర్వే (ABP Cvoter opinion poll) తెలిపింది. 40.7 శాతం ఓట్లు సాధిస్తుందని పేర్కొంది. ఇది గత ఎన్నికలతో పోలిస్తే 0.7 శాతం తక్కువ. మరోవైపు, ఎస్పీ 7.1 శాతం అధికంగా.. 31.1 శాతం ఓట్లను సాధిస్తుందని పేర్కొంది.
మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో..
ఉత్తర్‌ప్రదేశ్‌తో (UP Election 2022) పాటు ఎన్నికలు జరగనున్న పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల్లోనూ (Five State election 2022) సర్వే నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లో (Uttarakhand Election 2022) కాంగ్రెస్ బలంగా పుంజుకునే అవకాశం ఉందని సర్వే పేర్కొనగా... పంజాబ్‌లో (Punjab Election 2022) అతిపెద్ద పార్టీగా ఆమ్ ఆద్మీ అవతరించనుందని తెలిపింది.
ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. భాజపా 38 సీట్లతో మెజార్టీ మార్క్‌ను దాటుతుందని సర్వే పేర్కొంది. గతంలో సాధించిన 57 సీట్లతో పోలిస్తే 19 స్థానాలు తగ్గుతాయని అంచనా వేసింది. కాంగ్రెస్ 21 సీట్లు అధికంగా సాధించి.. అసెంబ్లీలో తన బలాన్ని 32 స్థానాలకు పెంచుకుంటుందని పేర్కొంది.
పంజాబ్‌లో ఆప్ హవా!
మరోవైపు, 'పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ 51 స్థానాలతో అందరికంటే ముందంజలో ఉంది. 117 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 46 సీట్లకు పరిమితం కానుంది. గత ఎన్నికల్లో 77 సీట్లు సాధించిన కాంగ్రెస్ ఈ సారి 31 నియోజకవర్గాలు కోల్పోనుంది. అయితే, కొత్త ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ పాలన.. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసొచ్చే అవకాశం ఉంది. 20 సీట్లతో అకాలీదళ్ మూడో స్థానంలో నిలవనుంద'ని సర్వే పేర్కొంది.