UP MLC Elections: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన భాజపా.. శాసన మండలి ఎన్నికల్లోనూ దూసుకుపోయింది. 27 స్థానాలకు ఎన్నికలు జరగగా.. 22 స్థానాల్లో గెలిచింది. కాగా, ప్రధాని సొంత నియోజకవర్గం వారాణాసిలో మాత్రం భాజపా ఓటమిపాలైంది. ఈ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి అన్నపూర్ణ సింగ్ 4,234 ఓట్లతో తేడాతో ఘన విజయం సాధించారు. భాజపా తరఫున పోటీచేసిన సుధామ పటేల్ 170 ఓట్లతో మూడో స్థానంలో నిలవగా.. ఎస్పీ అభ్యర్థి 345 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. కాగా, అయోధ్య, గోరఖ్‌పూర్, ఉన్నావ్, రాయ్‌బరేలీ సహా అనేక చోట్ల భాజపా మెజార్టీ సాధించింది. ఉత్తర్‌ప్రదేశ్ శాసనమండలి ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. భాజపాను గెలిపించిన ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలోని 36 శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరగగా.. తొమ్మిది స్థానాల్లో భాజపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 27 స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరిగింది. 100 మంది సభ్యులు గల ఉత్తర్‌ప్రదేశ్ శాసనమండలిలో.. భాజపాకు 34, ఎస్పీకి 17, బీఎస్పీకి 4 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్, అప్నాదళ్ నుంచి ఒక్కో సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Bengal By Elections: బంగాల్లో చెదురుమదురు ఘటనలు మినహా ఉపఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అసన్సోల్ లోక్‌సభ, బల్లిగంజ్ అసెంబ్లీ స్థానానికి మంగళవారం ఎన్నికలు జరుగాయి. సాయంత్రానికి అసన్సోల్లో 54.40 శాతం, బల్లిగంజ్‌లో 34.60 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా, అసన్సోల్ నియోజకవర్గంలో భాజపా, తృణముల్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. భాజపా అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ వాహనంపై తృణముల్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు.