తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశంపై భాజపా కిరోసిన్ చల్లింది.. ఒక్క నిప్పురవ్వ చాలు..' - రాహుల్ గాంధీ భాజపా

RAHUL GANDHI KEROSENE: లండన్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. దేశంలో పాకిస్థాన్‌ తరహా పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. దేశమంతా భాజపా కిరోసిన్ చల్లిందని.. సంక్షోభం తలెత్తేందుకు ఓ చిన్న నిప్పురవ్వ చాలని అన్నారు. దేశ భూభాగంలో చైనా తిష్ఠ వేసిందని మండిపడ్డారు.

RAHUL GANDHI KEROSENE
RAHUL GANDHI KEROSENE

By

Published : May 22, 2022, 5:39 AM IST

Rahul Gandhi London event: దేశమంతా భారతీయ జనతా పార్టీ కిరోసిన్‌ చిలకరించిందని, ఇప్పుడు సంక్షోభం తలెత్తడానికి ఓ చిన్న నిప్పురవ్వ చాలని నరేంద్ర మోదీ పాలనపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం లండన్‌ పర్యటనలో ఉన్న రాహుల్‌, ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన 'ఐడియాస్‌ ఫర్‌ ఇండియా' సమ్మేళనంలో శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భాజపా, ఆరెస్సెస్‌లపై విరుచుకుపడ్డారు. పాకిస్థాన్‌ తరహా పాలన భారత్‌లో సాగుతోందని విమర్శించారు. అక్కడిలానే ఈడీ, సీబీఐ లాంటి సంస్థలే దేశాన్ని నియంత్రిస్తున్నాయని ఆక్షేపించారు. ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌)పై నిప్పులు చెరిగారు. ఆ సంస్థ.. దేశంలోని వ్యవస్థలను కబ్జా చేసిందని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకలపై దాడి జరుగుతోందని, భారత్‌లో ప్రజాస్వామ్య మనుగడే ప్రమాదంలో పడిందని, ఇది అంతర్జాతీయ సమాజానికి ఏమాత్రం క్షేమకరం కాదని రాహుల్‌ హెచ్చరించారు. భారత్‌ 'ఆత్మ' పెనుప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తంచేశారు.

రాష్ట్రాలపై అణచివేత
రాజ్యాంగం ప్రకారం.. భారత్‌ ఓ దేశం కాదని, రాష్ట్రాల సమాఖ్య అని, ఈ విషయాన్ని కేంద్రం గుర్తించకపోవడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రాలపై తీవ్ర అణచివేత సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని వ్యవస్థలన్నీ రాష్ట్రాల మధ్య చర్చలు, సంవాదంతోనే ఏర్పడ్డాయని, ఇప్పుడు ఆ సంవాదమే ఆగిపోయిందని, వ్యవస్థలను ఓ సంస్థ కబ్జా చేసిందని అన్నారు. దీంతో రాష్ట్రాలు మాట్లాడలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. భారతదేశాన్ని ఓ భౌగోళిక ప్రాంతంగా, బంగారు చిలకగా భాజపా భావిస్తోందని రాహుల్‌ అన్నారు. బంగారు చిలక ప్రయోజనాలను అందరికీ సమానంగా పంచకుండా కొందరికే అధికంగా దోచిపెడుతోందని ఆరోపించారు.

తప్పుగా అర్థం చేసుకున్నారు
Rahul on Regional parties:ప్రాంతీయ పార్టీలకు భాజపాతో పోరాడే భావజాలం లేదని ఉదయ్‌పుర్‌లో జరిగిన చింతన శిబిరంలో చేసిన వ్యాఖ్యలపై రాహుల్‌ గాంధీ వివరణిచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ప్రాంతీయ పార్టీలకంటే కాంగ్రెస్‌ గొప్పేమీ కాదని, భాజపాపై పోరాటంలో తమ పార్టీ పెద్దన్న పాత్ర పోషించాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే ఆరెస్సెస్‌, కాంగ్రెస్‌ మధ్య జాతీయస్థాయిలో భావజాల పోరాటం సాగుతోందని తెలిపారు.

రష్యాలానే.. చైనా కూడా
భారత్‌ పరిస్థితిని ఉక్రెయిన్‌తో పోల్చారు రాహుల్‌. ఉక్రెయిన్‌లోని ప్రాంతాల్లో రష్యా ఎలా తిష్ఠ వేసిందో, చైనా కూడా లద్ధాఖ్‌, డోక్లాంలో గుడారాలు వేసుకుందని, అయినా మోదీ ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తోందని ఎద్దేవా చేశారు. పాంగాంగ్‌ సరస్సుపై ఇటీవల చైనా వంతెన నిర్మించిన విషయాన్ని ప్రస్తావించారు. సరిహద్దుల్లో సమస్య ఉందని గుర్తించడానికే కేంద్రం ఇష్టపడటం లేదని, దీనిపై చర్చకు ముందుకు రావడం లేదని అన్నారు. ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసు పూర్తిగా మారిపోయిందని.. అందులోని అధికారులు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తనకు కొంతమంది అధికారులు చెప్పారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విపక్ష నాయకులు సీతారాం ఏచూరి (సీపీఎం), తేజస్వీ యాదవ్‌ (ఆర్జేడీ), తదితరులు పాల్గొన్నారు.

'దేశ పరువు తీస్తున్నారు'
కాగా, లండన్‌లో రాహుల్‌ ప్రసంగంపై భాజపా మండిపడింది. విదేశాల్లో భారత్‌ పరువు తీయడం కాంగ్రెస్‌ నేతకు అలవాటుగా మారిందని, గతంలోనూ ఇలానే చేశారని ఆక్షేపించింది. కిరోసిన్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 1984 సిక్కు అల్లర్ల నుంచి కాంగ్రెస్‌ కిరోసిన్‌ పట్టుకొని తిరుగుతోందని, ఆ పార్టీ రేపిన మంటలు ఇంకా చల్లారలేదని విమర్శించింది. ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసు గతంలోలా లేదని, అధికారులు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారన్న రాహుల్‌ వ్యాఖ్యలపై విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్‌ స్పందించారు. "అవును మారిపోయింది. ప్రభుత్వ ఆదేశాలను అధికారులు పాటిస్తున్నారు. ఇతరుల వాదనను వారు గట్టిగా ఖండిస్తున్నారు. ఇది అహంకారం కాదు. ఆత్మవిశ్వాసం. దేశ ప్రయోజనాలను పరిరక్షించడం" అని ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details