తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీలో వ్యూహం మార్చిన భాజపా.. వర్గ రాజకీయాలపై దృష్టి! - యూపీలో భాజపా వర్గ రాజకీయాలు

UP polls 2022: యూపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా అభివృద్ధి మంత్రం జపించే అధికార పార్టీ.. ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. యాదవేతర ఓబీసీ వర్గాల్లో కొందరు, బ్రాహ్మణుల్లో కొందరు తమకు దూరమవుతున్నారన్న సమాచారంతోనే భాజపా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే అభివృద్ధి కంటే ఇతర అంశాలపై దృష్టి సారిస్తోంది.

bjp communal politics in 2022 elections
వ్యూహం మార్చిన భాజపా

By

Published : Feb 6, 2022, 2:16 PM IST

UP polls 2022: ఉత్తర్‌ప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి రాజకీయ పరిణామాలు చాలావరకు మారిపోయాయి. దీంతో 'అభివృద్ధి' నినాదం వెనక్కి వెళ్లిపోయింది. ముఖ్యమంత్రిగా మొదటిసారి పూర్తి పదవీకాలంపాటు కొనసాగిన నేత వరసగా రెండోసారి నెగ్గిన దాఖలా ఇంతవరకు యూపీలో లేదు. ఈసారి దీనిని మార్చి, చరిత్రను తిరగరాస్తామని కొద్దినెలల క్రితం వరకు కమలనాథులు ధీమాగా ఉండేవారు. విపక్షాల్లో ఉన్న అయోమయాన్ని, చీలికలను తమకు అనుకూలంగా మలచుకోవచ్చని కూడా భావిస్తూ వచ్చారు. భాజపాని ఓడించడానికి 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీ కలిసి పోటీ చేశాయి. తర్వాత విడిపోయాయి. బీఎస్పీ అప్పటి నుంచి స్తబ్ధుగానే ఉంది. ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలూ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. సమాజ్‌వాదీ ఆరు నెలలుగా దూకుడు పెంచి, శాసనసభ ఎన్నికలకు సన్నద్ధమవుతూ వస్తోంది. కుటుంబంలో తలెత్తిన సమస్యలనూ సర్దుకుని ముందడుగు వేస్తోంది. అయితే ఆ పార్టీకి సమస్యలు లేవని చెప్పలేని పరిస్థితి. భాజపా, కాంగ్రెస్‌, బీఎస్పీల్లోని అసంతృప్తివాదుల్ని సమాజ్‌వాదీలోకి తీసుకోవడం ఎంతోకాలంగా పార్టీని నమ్ముకుని ఉన్నవారిలో ఆగ్రహానికి కారణమవుతోంది. మాఫియాలకు అనుకూల పార్టీగా చాలా కాలం నుంచి పడిన ముద్రను తొలగించుకోవడం ఆ పార్టీకొక సవాల్‌గానే ఉంది.

వర్గాల దూరంతో కలవరం

గణాంకాలు చెబుతున్న వాస్తవాలను దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు అభివృద్ధి నినాదాన్ని భాజపా కాస్త పక్కనపెట్టింది. క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారమూ దీనికి కారణం. యాదవేతర ఓబీసీ వర్గాల్లో కొందరు, బ్రాహ్మణుల్లో కొందరు తమకు దూరమవుతున్నారన్న సమాచారం కమలనాథుల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. వీరంతా 2017 ఎన్నికల్లో భాజపాకు అండగా నిలిచారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటివి కూడా ప్రభుత్వ వ్యతిరేకతకు ఆజ్యం పోస్తున్నాయి. దానిని తట్టుకునే ప్రయత్నాల్లో భాగంగానే మత ప్రాతిపదికన ఓటర్లను ఏకోన్ముఖుల్ని చేసే చర్యల్ని కమలనాథులు ప్రారంభించినట్లు విమర్శలు ఉన్నాయి. 80% × 20% పోరు, కృష్ణ జన్మభూమిలో ఆలయ నిర్మాణం, 'అబ్బా జాన్‌' అని అనేవారికే ప్రభుత్వ పథకాలు పరిమితం చేయలేదని చెప్పడం వంటివి చోటు చేసుకున్నాయి.

గెలుపుపై అఖిలేశ్‌ ధీమా

అఖిలేశ్‌ చేపట్టిన రాష్ట్రవ్యాప్త రథయాత్రకు యాదవులు, ముస్లింలు పెద్దగా లేని ప్రాంతాల్లోనూ స్పందన బాగుంది. బీఎస్పీ, కాంగ్రెస్‌ వంటి పెద్ద పార్టీలకు బదులుగా ఏడు చిన్న ఉప ప్రాంతీయ పార్టీలతో సమాజ్‌వాదీ ఈసారి పొత్తు పెట్టుకుంది. అవి తక్కువ సీట్లతో సరిపెట్టుకోవడంతో పాటు కొన్ని సామాజిక వర్గాల ఓట్లను గంపగుత్తగా రాబట్టడానికి ఉపయోగపడతాయని ఎస్పీ భావిస్తోంది. బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌ సొంతపార్టీని సమాజ్‌వాదీలో విలీనం చేశారు. కుటుంబ రాజకీయాల ముద్రను చెరిపివేసేందుకు అఖిలేశ్‌ తన భార్య డింపుల్‌ యాదవ్‌కు రాజకీయ ప్రాధాన్యం తగ్గించారు. ఈసారి యూపీలో భాజపా ఓటమి ఖాయమని ఆయన నమ్మకంగా చెబుతున్నారు.

కేంద్ర గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..

గత ఐదేళ్లలో అనూహ్య రీతిలో అభివృద్ధి సాధించినట్లు యోగి సర్కారు చెబుతోంది. కేంద్ర గణాంకాలను చూస్తే పరిస్థితి దీనికి భిన్నంగా కనిపిస్తుంది. అఖిలేశ్‌ చివరి మూడేళ్ల పాలనలో (2014-17) యూపీలో తలసరి జీడీపీ ఏటా సగటున 7.8% పెరుగుతూ వచ్చింది. కరోనా తీవ్రతకు ముందు మూడేళ్లలో యోగి పాలనలో ఇది 5.2% ఉన్నట్లు కేంద్ర గణాంకాలే చెబుతున్నాయి. అఖిలేశ్‌ హయాంలో చివరి మూడేళ్లు రాష్ట్ర జీడీపీ వృద్ధి 9.1% ఉండగా, ఆదిత్యనాథ్‌ సీఎంగా ఉన్న తొలి మూడేళ్లలో అది 6.4%గా ఉంది. తలసరి ఆదాయంలోనూ దేశ సగటు (రూ.99,694) కంటే యూపీ (రూ.73,792) వెనుకబడి ఉంది.

ఇదీ చూడండి:యూపీ తొలిదశ ఎన్నికల్లో 15 మంది నిరక్షరాస్యులు

ABOUT THE AUTHOR

...view details