తెలంగాణ

telangana

By

Published : Jan 16, 2023, 7:19 PM IST

ETV Bharat / bharat

'2024 ఎన్నికలే టార్గెట్​.. 9 రాష్ట్రాల్లోనూ భాజపానే గెలవాలి'

2023లో జరగబోయే 9 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క చోట కూడా భాజపా ఓటమి పాలవ్వకుండా వ్యూహరచన చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. మోదీ హయాంలోనే దేశంలో అభివృద్ధి జరిగిందని కొనియాడారు. దిల్లీలో జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన ఈమేరకు ప్రసంగించారు.

bjp executive meet
bjp executive meet

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు దిల్లీలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు 2023లో జరగబోయే తొమ్మిది రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ప్రాముఖ్యాన్ని పార్టీ నేతలకు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా వివరించారు. 9 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క చోట కూడా భాజపా ఓటమి పాలవ్వకుండా వ్యూహరచన చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మోదీ నాయకత్వంలోనే దేశంలో అభివృద్ధి జరిగిందని కొనియాడారు.

"మోదీ హయాంలో భారత్..​ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మొబైల్​ ఫోన్ల తయారీలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఆటోమొబైల్​ రంగంలో మూడో అతి పెద్ద తయారీదారుగా భారత్​ నిలిచింది. అనేక సంక్షేమ పథకాలతో పేదలకు సాధికారత కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తోంది. ఇటీవలే గుజరాత్​లో భాజపా చారిత్రక విజయాన్ని సాధించింది. 182 మంది సభ్యుల అసెంబ్లీలో 150కి పైగా సీట్లు గెలవడం అసాధారణమైన విజయం. హిమాచల్​ ప్రదేశ్​లో భాజపా ఓటమిపాలైనా.. రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం ఒక శాతం కంటే తక్కువే."

-- జాతీయ కార్యవర్గ సమావేశంలో జేపీ నడ్డా

జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ, జేపీ నడ్డా
జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరైన పార్టీ నేతలు

అంతకుముందు, ప్రధాని మోదీ.. భారీ రోడ్​ షో ద్వారా జాతీయ కార్యవర్గ సమవేశాలు జరిగే ప్రాంగణానికి చేరుకున్నారు. జ్యోతి ప్రజ్వలన చేసిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. 2 రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో దేశం ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు రాజకీయ, ఆర్థిక అంశాలపై చర్చించి తీర్మానాలు ఆమోదించనున్నట్లు కమలనాథులు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ఈ నెలతో ముగియనున్న నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల వరకు ఆయనను కొనసాగించటంపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.

జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరైన పార్టీ నేతలు

జాతీయ కార్యవర్గ సమావేశాలకు తొలి రోజు.. ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులు, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, తదితరులు హాజరయ్యారు. గుజరాత్​లో భాజపా భారీ విజయం తర్వాత ఇదే తొలి కార్యవర్గ సమావేశం కావడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details