తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా 'సంకీర్ణ' మంత్రం- అన్నాడీఎంకే నిరాక'రణం' - 2021లో శాసనసభ ఎన్నిక

తమిళనాట రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. స్థానిక పార్టీలకే పట్టం కట్టే తమిళులు జాతీయ పార్టీలను పెద్దగా పెట్టించుకోరు. అయితే, దక్షిణాదిలో పట్టు సాధించాలని పట్టుదలతో ఉన్న కమలదళం.. తమిళనాడులో ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని సొమ్ము చేసుకుంది. కేంద్రం సాయంతో అక్కడి అధికార అన్నాడీఎంకేను చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో అధికారం పంచాలని భాజపా నేతలు ప్రతిపాదించటం.. వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

BJP Demands
పదవి పంచుదామంటున్న భాజపా.. అక్కర్లేదంటున్న అన్నాడీఎంకే

By

Published : Nov 11, 2020, 5:29 PM IST

తమిళనాడులో ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలమైన కేడర్‌ లేకపోయినా.. చెన్నై పీఠంపై కన్నేసింది భాజపా. ప్రస్తుతం అధికార అన్నాడీఎంకేకు మద్దతిస్తోన్న ఆ పార్టీ.. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తం అవుతోంది. అదే సమయంలో అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.

తమిళనాడులో వచ్చే ఏడాది కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వంలో భాజపా భాగస్వామిగా ఉంటుంది.

-హెచ్‌ రాజా, తమిళనాడు భాజపా నేత

భాజపా వ్యూహాలు

తమిళనాడు ఎన్నికల్లో ప్రభావం చూపించాలని భావిస్తోన్న భాజపా.. అందుకు తగినట్లుగా వ్యూహరచన చేస్తోంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేపై ఒత్తిడి పెంచుతోంది. గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో 2% మాత్రమే ఓట్లు సాధించిన కమలదళం.. ఈసారి ఎన్నికల్లో క్రీయాశీలకంగా వ్యవహరించాలని భావిస్తోంది. జయలలిత మరణం తర్వాత అధికార పార్టీలో ఏర్పడిన నాయకత్వ శూన్యతను సొమ్ము చేసుకున్న భాజపా.. జాతీయ స్థాయి జోక్యంతో అనిశ్చితిని చక్కబెట్టింది. ఇప్పుడు అదే మాటచెప్పి అన్నాడీఎంకేతో అధికారం పంచుకోవాలని చూస్తోంది.

భాజపా ఎంపిక చేసినవారే వచ్చే ఎన్నికల తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపడతారు.

-ఎల్‌ మురుగన్‌, భాజపా తమిళనాడు అధ్యక్షుడు

భాజపా తమిళనాడు అధ్యక్షుడు

అదే సమయంలో 2021లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో.. భాజపా ఒంటరిగానే 60కిపైగా స్థానాలు గెలుస్తుందని కమలం నేతలు విశ్వాసంగా చెబుతున్నారు.

అన్నాడీఎంకే ఆగ్రహం

ప్రస్తుతం రాష్ట్రంలో అన్నాడీఎంకే-డీఎంకే మధ్య గట్టిపోటీ నెలకొన్న నేపథ్యంలో భాజపా వ్యాఖ్యలు.. అన్నాడీఎంకేకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. మిత్రపక్షం ప్రకటనల్ని బహిరంగంగానే ఖండిస్తున్నారు అధికార పార్టీ నేతలు.

అన్నాడీఎంకేకు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచన ఏ మాత్రం లేదు. అలాంటి అవకాశమే లేదు. రాష్ట్ర ప్రజలు అది కోరుకోవట్లేదు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే భారీ మెజార్టీతో తిరిగి అధికారం చేపడుతుంది.

-డి. జయకుమార్‌, తమిళనాడు మంత్రి

2021లో విజయ తీరాలకు చేరేనా?

ద్రవిడ పార్టీలే

అయితే, అన్నాడీఎంకే-భాజపా వాదనలు ఎలా ఉన్నా.. ఇప్పటివరకు తమిళనాడులో పార్టీలు అధికారం పంచుకున్న దాఖలాలు లేవు. రాష్ట్రాన్ని ద్రవిడ పార్టీలే ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భాజపా డిమాండ్‌ను అన్నాడీఎంకే నిరభ్యంతరంగా ఖండించింది.

దూకుడే మంత్రం..

ప్రస్తుతం తమిళనాట భాజపాకున్న బలం చూసుకుంటే.. ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో లేదు. అయినా, ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి రాష్ట్రంలో విస్తరించాలని చూస్తోంది. కేంద్రం విజయాలతో రాష్ట్రంలో ఓట్లు రాబట్టాలని చూస్తోంది. అందుకు అనుగుణంగానే దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది.

అయితే, అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొన్నిసార్లు బెడిసికొడుతున్నాయి. భాజపా సుబ్రమణ్యస్వామి ఆలయాల సందర్శనకు చేపట్టిన 'వేల్‌ యాత్ర'కు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోగా.. రాష్ట్ర భాజపా అధ్యక్షుడిని అరెస్టు చేసి కమలదళానికి షాక్‌ ఇచ్చింది.

అధికారపార్టీ అవస్థలు

అన్నాడీఎంకే పరిస్థితి కూడా అయోమయంగానే ఉంది. ముఖ్యమంత్రి అభ్యర్థి అంశం కొలిక్కివచ్చినా.. ఇప్పటికీ పార్టీలో అనేక అంతర్గత సమస్యలున్నాయి. మరోవైపు ఓటర్ల మద్దతు కోల్పోతున్న పరిస్థితి. ముఖ్యంగా మైనార్టీల ఓటు బ్యాంకుపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో.. వచ్చే ఎన్నికల్లో భాజపాకు 10 స్థానాలకంటే ఎక్కువ కేటాయించొద్దని భావిస్తోంది. అయితే, భాజపా ఎక్కువ స్థానాలకు గట్టిగానే డిమాండ్‌ చేస్తోంది.

మొత్తంగా భాజపా గద్దించి.. గద్దెపై స్థానం సాధించాలని చూస్తోంది. అన్నాడీఎంకే.. పరిస్థితులను నిశితంగా చూస్తోంది. ఎన్నికలకు నెలల సమయమే ఉన్న నేపథ్యంలో భాజపా తమ బలం-బలగం పెంచుకోవటానికి విస్తృతంగా ప్రయత్నాలు చేస్తోంది. అధికార పార్టీ సైతం.. బలమైన వాదన వినిపిస్తుండటం ఇరుపార్టీల మధ్య చిచ్చుపెట్టే అవకాశాలను సృష్టిస్తుందంటున్నారు విశ్లేషకులు. మొత్తంగా రానున్న రోజుల్లో అన్నాడీఎంకే పార్టీకి.. భాజపా మరిన్ని తలనొప్పులు సృష్టించే అవకాశముందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదీ చూడండి: విభేదాల మధ్య ఒకే వేదికపై పళనిస్వామి, పన్నీర్ సెల్వం

ఇదీ చూడండి: 'వైద్య విద్య రిజర్వేషన్​ బిల్లు'కు గవర్నర్​ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details