BJP Central Election Committee Meeting :ఈ ఏడాది చివరిలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సన్నద్ధతపై బీజేపీ కసరత్తు చేపట్టింది. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ముఖ్యంగా ఈ సమావేశంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలపైనే చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు JP నడ్డా సహా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లోని 27 అసెంబ్లీ సీట్లపై ప్రధానంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీటిని ఏ, బీ, సీ, డీ వర్గాలుగా విభజించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తాజాగా జరిపిన సమావేశంలో బీ, సీ కేటగిరీలో ఉన్న 22 స్థానాలు, డీ కేటగిరీలో ఉన్న 5 సీట్లపైనే చర్చించినట్లు చెప్పాయి. మెజారిటీ స్థానాల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టే అంశాన్ని పరిశీలించినట్లు సమాచారం.
పార్టీ బలహీనంగా ఉన్న స్థానాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓడిపోయిన సీట్లపై సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నాయి. వీటితో పాటు ఆయా రాష్ట్రాల నాయకత్వం ఇచ్చిన నివేదికను పరిశీలించినట్లు తెలిపాయి. ఈ సమావేశానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్ పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థులు, ఎన్నికల వ్యూహాల ఖరారే లక్ష్యంగా.. ఈ సమావేశం జరిగింది.
వాస్తవానికి ఎన్నికల తేదీల ప్రకటనకు కొద్దిరోజుల ముందు ఈ కమిటీ భేటీ అవుతుంది. అయితే కొద్దినెలల ముందే ఈ కమిటీ సమావేశం కానుండడంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో ఓటమి దృష్ట్యా.. త్వరలో జరిగే ఎన్నికల్లో రాజీలేని పోరాటం చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరిలో మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణలో విపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఈ మూడుచోట్ల అధికారం కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది.