BJP Candidate List 2023 Rajasthan :రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించాయి బీజేపీ, కాంగ్రెస్. కీలకమైన నేతలతో కూడిన 83 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. మాజీ ముఖ్యమంత్రి, కీలక నేత వసుంధరరాజె తన సొంత నియోజకవర్గమైన ఝాల్రాపాటన్ నుంచే పోటీ చేయనున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి భైరన్ సింగ్ షెకావత్ అల్లుడు, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నర్పత్ సింగ్ రాజ్వీని చిత్తౌడ్‌గఢ్ సీటు నుంచి బరిలో దించింది. మహారాణా ప్రతాప్ వారసుడు విశ్వరాజ్ సింగ్ మేవాడ్‌కు నాథ్‌ద్వారా టికెట్ కేటాయించింది. బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియాను ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమేర్ నుంచే బరిలోకి దించింది. ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీ సభాపక్ష నేతగా ఉన్న రాజేంద్ర రాఠోడ్‌కు సైతం టికెట్ ఇచ్చింది. రెండో జాబితాతో కలిపి బీజేపీ ఇప్పటివరకు 124 మంది అభ్యర్థులను ప్రకటించినట్లైంది.
నర్పత్ సింగ్ రాజ్వీకి టికెట్ కేటాయింపుపై పార్టీలో భిన్నాభిప్రాయాలు నెలకొన్న వేళ.. రెండో జాబితాలో ఆయన పేరు కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నర్పత్ సింగ్ ప్రస్తుతం విద్యాధర్ నగర్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలి జాబితాలో ఆయనకు ఈ స్థానాన్ని కేటాయించలేదు. దీంతో రాజ్వీ.. పార్టీ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆయనకు చిత్తౌడ్‌గఢ్ స్థానాన్ని కేటాయించింది.
కాంగ్రెస్ తొలి జాబితా..
Congress Candidate List 2023 Rajasthan :మరోవైపు, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను అధికార కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 33 మంది అభ్యర్థులకు ఇందులో స్థానం కల్పించింది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌కు సర్దార్‌పుర, మరో కీలక నేత సచిన్ పైలట్‌కు టోంక్ నియోజకవర్గాన్ని కేటాయించింది. స్పీకర్ సీపీ జోషిని నాథ్‌ద్వారా నుంచి బరిలోకి దించింది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోస్తారాను లక్ష్మణ్‌గఢ్ టికెట్ కేటాయించింది. మంత్రులు హరీశ్ చౌదరి, మమతా భూపేశ్‌కు వరుసగా బాయ్తూ, సిక్రాయీ(ఎస్సీ) సీట్లను కేటాయించింది.
త్వరలోనే మరిన్ని సీట్లకు..
మెజారిటీ స్థానాలకు కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఆదివారం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం మరిన్ని స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది. 200 స్థానాలు ఉన్న రాజస్థాన్ అసెంబ్లీకి నవంబర్ 25న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 3న వెలువడుతాయి.