BJP Candidate List 2023 Assembly Election :త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ వ్యూహాలను రచిస్తోంది. సార్వత్రిక ఎన్నికల సమరానికి సైమీ ఫైనల్‌గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి నలుగురు కేంద్ర మంత్రులు సహా 18 మంది ఎంపీలను శాసనసభ ఎన్నికల బరిలోకి దింపుతోంది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను.. మధ్యప్రదేశ్‌లో రెండు జాబితాలను విడుదల చేసింది. తాజాగా ఆ రెండు రాష్ట్రాలకు సంబంధించి మరో జాబితాను విడుదల చేసింది. అంతేగాక రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది అధిష్ఠానం.
మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే 57 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను విడుదల చేసింది బీజేపీ అధిష్ఠానం. ఈ జాబితాలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఉన్నారు. సీఎం శివరాజ్ బుధ్ని నుంచి బరిలోకి దిగుతుండగా.. నరోత్తమ్ మిశ్రా దతియా నుంచి పోటీ చేస్తున్నారు. అంతకుముందు బీజేపీ విడుదల చేసిన జాబితాలో ముగ్గురు కేంద్ర మంత్రులు సహా ఏడుగురు ఎంపీలను శాసససభ ఎన్నికల బరిలోకి దింపింది.
ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 64 మంది అభ్యర్థులను ప్రకటించగా.. అందులో ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్.. రాజ్‌నంద్‌గావ్ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే ఎంపీలు రేణుకా సింగ్, గోమతి సాయి కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. మొత్తం బీజేపీ రెండు విడతల్లో విడుదల చేసిన 85 విడుదల చేసిన జాబితాలో ఓ కేంద్ర మంత్రి సహా ముగ్గురు ఎంపీలు ఉన్నారు.
రాజస్థాన్‌లో బీజేపీ తరఫున పోటీ చేసే 41 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. వీరిలో రాజ్‌సమంద్ ఎంపీ దియా కుమారి, జైపుర్ రూరల్ ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్ సహా ఏడుగురు ఎంపీలు ఉన్నారు. విద్యాధర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దియా కుమారి బరిలోకి ఉండగా.. జోత్వారా నుంచి రాజ్యవర్ధన్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.