జమ్ముకశ్మీర్లోప్రత్యర్థి పార్టీలపై విమర్శల వర్షం కురిపించింది భాజపా. ఆర్టికల్- 370 పునరుద్ధరణ సహా ఇతర వివాదాస్పద డిమాండ్లు చేస్తోన్న పాకిస్థాన్ వంటి దేశాల మాదిరిగానే వీరి వైఖరి ఉందని ఆరోపించింది.
నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీలు గుప్కర్ అలియన్స్‌గా ఏర్పడగా.. ఆ పక్షాలతో కాంగ్రెస్ జట్టుకట్టడంపై విమర్శలు గుప్పించారు భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర. రాహుల్ గాంధీపైనా ఆరోపణలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి ఆర్జేడీ నేత శివానంద తివారీ, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ సైతం రాహుల్‌పై విమర్శలు చేశారని గుర్తు చేశారు. ఒబామాకు రాహుల్ కేవలం నాలుగు నుంచి ఐదు రోజులు మాత్రమే తెలిస్తేనే అలా అన్నారంటే.. రాహుల్‌తో రోజూ ఉండే వారికి ఆయన గురించి పూర్తిగా తెలుస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీని ప్రశంసించే సమయంలో 100 టన్నుల రాయిని తమ ఛాతిపై మోసేవారని, ఇప్పుడు వారు ఊపిరి పీల్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు సంబిత్ పాత్ర.
" భాజపా చాలా కాలంగా అదే చెబుతోంది. కాంగ్రెస్‌కు మంచి నమ్మకస్తుడైన శివానంద తివారీనే ఇప్పుడు అతను (రాహుల్) పని చేయని పిక్నిక్ ప్రెసిడెంట్ అని చెబుతున్నారు. గుప్కార్ అలియన్స్ అనేది అపవిత్రమైనది. భారత పార్లమెంట్ ఆమోదించిన చట్టాలను వ్యతిరేకించటమే దాని లక్ష్యం. పాకిస్థాన్ సహా భారత వ్యతిరేఖ దేశాలు కోరుకునేదే గుప్కార్ అలియన్స్ కోరుకుంటుంది. పాకిస్థాన్ ప్రతి అంతర్జాతీయ సమావేశానికి వెళ్లి ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించింది. గుప్కార్ అలియన్స్ కూడా అదే చేస్తోంది."