BJP assets in 2019-20: దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా భాజపా అగ్రస్థానంలో ఉంది. 2019-20 సంవత్సరానికి సంబంధించి దేశంలోని ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల లెక్కలకు సంబంధించిన వివరాలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) శుక్రవారం నివేదిక విడుదల చేసింది.
list of richest political party in india
మొత్తం 51 పార్టీల ఆస్తులన్నింటిని కలిపి లెక్కించగా రూ.9,117.95 కోట్లు ఉండగా.. ఇందులో ఒక్క భాజపా ఆస్తులే రూ.4,847.78 కోట్లు (53.16%). బ్యాంకుల్లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్థిరాస్తులు, వాహనాలు, ఇతర ఆస్తులు, రుణాల రూపంలో తీసుకున్న నగదు, టీడీఎస్, టీఏసీఎస్‌లు కలుపుకొని లెక్కించగా.. ఏడు జాతీయ పార్టీల ఆస్తులు రూ.6,988.57 కోట్లుగా తేలింది. ఇందులో సింహభాగం ఫిక్స్‌డ్ డిపాజిట్ల కిందే ఉన్నాయి. జాతీయ పార్టీల్లో అతి తక్కువగా రూ.8.20 కోట్లతో ఎన్సీపీ ఏడోస్థానంలో నిలిచింది.
అప్పుల్లేని పార్టీ బీఎస్పీ..
Indian Political parties assets:ఆస్తులపరంగా దేశంలో ద్వితీయస్థానంలో ఉన్న బీఎస్పీకి అప్పు మాత్రం ఒక్క రూపాయి కూడా లేదు. ఆస్తుల్లో మూడోస్థానంలో ఉన్న కాంగ్రెస్ అప్పుల్లో మొదటిస్థానంలో ఉంది. ఈ పార్టీకి రూ.49.55 కోట్ల అప్పులు ఉండగా, రూ.30.342 కోట్ల అప్పులతో తెదేపా రెండోస్థానంలో ఉంది. తెరాసకు రూ.4.41 కోట్లు అప్పులు ఉండగా.. వైకాపా అప్పులను నివేదికలో పొందుపర్చలేదు. ఏడు జాతీయ పార్టీల అప్పులు రూ.74.27 కోట్లు, 44 ప్రాంతీయ పార్టీల అప్పులు రూ.60.66 కోట్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మొత్తం కలిపి రూ.134.93 కోట్ల అప్పులు ఈ పార్టీలకు ఉన్నాయి.
పది పార్టీల చేతుల్లోనే 95.27% ఆస్తులు..
దేశంలో 44 ప్రాంతీయ పార్టీల ఆస్తుల మొత్తం విలువ రూ.2,129.38 కోట్లుగా తేలింది. ఇందులో పది ప్రాంతీయ పార్టీల ఆస్తులే రూ.2,028.715 కోట్లు (95.27%) ఉన్నాయి. ఈ పది పార్టీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన తెరాస, తెదేపా, వైకాపా ఉన్నాయి.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి:'త్వరలో భారత్-చైనా 15వ విడత చర్చలు- ఆ తీర్మానానికి అంగీకారం'