Bjp New State President : 2024 సార్వత్రిక ఎన్నికలు, ఈ ఏడాది జరగనున్న పలు రాష్ట్రాల ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున సంస్థాగత మార్పులు చేపట్టింది. 4 రాష్ట్రాలకు బీజేపీ నూతన అధ్యక్షులను నియమించింది. పంజాబ్‌కు సునీల్ జాఖఢ్, ఝార్ఖండ్‌కు బాబూలాల్ మరాండీ, ఆంధ్రప్రదేశ్‌కు దగ్గుబాటి పురందేశ్వరి, తెలంగాణకు కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డిని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ మేరకు భాజపా ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకాలు తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపారు.
గతంలో పంజాబ్ పీసీసీ అధ్యక్షునిగా నాలుగేళ్లు పనిచేసిన సునీల్ జాఖఢ్.. గతేడాది మే 19న భారతీయ జనతా పార్టీలో చేరారు. అశ్వినీ కుమార్ శర్మ స్థానంలో పంజాబ్ చీఫ్‌గా సునీల్ జాఖడ్‌కు బీజేపీ అధిష్ఠానం అవకాశం ఇచ్చింది. ఝార్ఖండ్ బీజేపీ చీఫ్ దీపక్ ప్రకాశ్.. స్థానంలో బాబులాల్ మరాండీని కొత్త అధ్యక్షుడిగా బీజేపీ అధిష్ఠానం నియమించింది. అలాగే తెలంగాణలో బండి సంజయ్ కుమార్ స్థానంలో జి. కిషన్‌రెడ్డికి అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌లో సోము వీర్రాజు స్థానంలో కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి అవకాశం ఇచ్చింది.
నాలుగు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన కొందరికి త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జులై 7న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌ల సమావేశం జరగనుందని పేర్కొన్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి.
బాబులాల్ మరాండీ రాజకీయ ప్రస్థానం..
Babulal Marandi Bjp President : బాబులాల్ మరాండీ 1958లో గిర్డిహ్ జిల్లాలో జన్మించారు. ఆయన గిరిడిహ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1991లో బీజేపీలో చేరారు బాబులాల్ మరాండీ. 1991,1996లో దుమ్కా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1998లో అదే లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. వాజ్‌పేయ్ ప్రభుత్వంలో అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. కొత్తగా ఏర్పడిన ఝార్ఖండ్ రాష్ట్రానికి బాబులాల్ మరాండీ.. 2000లో మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2003లో ఆ పదవికి రాజీనామా చేశారు. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల 2006లో బీజేపీని వీడి.. ఝార్ఖండ్ వికాస్ మోర్చా(JVM) అనే పార్టీని స్థాపించారు. 2019లో ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. బాబులాల్ మరాండీ.. ప్రస్తుతం ఝార్ఖండ్ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు.
సునీల్ జాఖడ్ రాజకీయ ప్రస్థానం..
Sunil Jakhar Bjp President : సునీల్ జాఖడ్.. 1954వ సంవత్సరంలో జన్మించారు. ఈయన గతంలో పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. గతేడాది మేలో కాంగ్రెస్‌ను వీడి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు జాఖడ్.
దగ్గుబాటి పురందేశ్వరి ప్రస్థానం..
Purandeswari BJP AP President దగ్గుబాటి పురందేశ్వరి 1959 ఏప్రిల్ 22న జన్మించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన పురందేశ్వరి.. 2004లో బాపట్ల నుంచి.. 2009లో విశాఖ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ పార్టీని వీడారు. ఆ తర్వాత 2014లో పురందేశ్వరి బీజేపీలో చేరారు. బీజేపీ మహిళా మోర్చా ప్రధాన ప్రభారిగా బాధ్యతలు నిర్వహించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ బీజేపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది.
కిషన్‌రెడ్డి ప్రస్థానం..
Kishan Reddy BJP President : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గతంలోనూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 2010-14 మధ్య ఉమ్మడి ఏపీకి, 2014-16 మధ్య తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. 2016-18 మధ్య శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అధిష్ఠానం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై ఆయన తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించనున్నారు.