భాజపా.. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింటిలో విజయం సాధించి అధికారం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఒక్క పంజాబ్ మినహా గోవా, ఉత్తరాఖండ్, మణిపుర్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ మెజారిటీ సాధించింది. ఇప్పుడు 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించింది. ఆ దిశగా రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటు, కేబినెట్ కూర్పుపై పార్టీ అధిష్ఠానం సమాలోచనలు చేస్తోంది. ఈ మేరకు రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. శాసనసభ ఎన్నికల్లో పార్టీ పనితీరును భాజపా సమీక్షిస్తున్నట్లు కాషాయ వర్గాలు తెలిపాయి.
సీట్లు తగ్గటంపై ఆందోళన..
ఉత్తర్‌ప్రదేశ్ 36 ఏళ్ల ఎన్నికల చరిత్రలో అధికార పార్టీ వరుసగా రెండోసారి గెలుపొందదనే సంప్రదాయానికి స్వస్తి పలికారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. అవసరమైన మేజారిటీని సాధించి మరోమారు అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే, 2017 ఎన్నికలతో పోలిస్తే భాజపా 60 సీట్లు తక్కువగా సాధించింది. 2017లో కాషాయ పార్టీకి 325 సీట్లు రాగా.. ఇటీవలి ఎన్నికల్లో 255కే పరిమితమవటం పార్టీ అధిష్ఠానానికి ఆందోళన కలిగించే విషయమే.
పార్టీ వర్గాల ప్రకారం.. ప్రస్తుతం భాజపా అధిష్ఠానం ఇటీవలి ఎన్నికలు, ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తోంది. ఎన్నికల ఫలితాలు, రాష్ట్ర ప్రభుత్వాల కొత్త మంత్రివర్గం కూర్పుపై వివిధ సమావేశాల్లో లోతైన విశ్లేషణ, సమీక్ష జరిపుతోంది. ఇటీవలి సమావేశంలో ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల బ్లూప్రింట్‌ను ప్రధాని మోదీ ముందు ఉంచారు ఆ రాష్ట్ర ఇంఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్. ఆ సమావేశంలో ఎన్నికైన అభ్యర్థుల విద్యార్హతలు, ప్రత్యేకత, వారి కులం, వయసు వంటి అంశాలపై చర్చించారు. కొత్త కేబినెట్లో అభ్యర్థుల విద్యార్హత, వయస్సుకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా కనిపిస్తోంది. విద్యావంతులు, యువకులకు ఈసారి అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. దీంతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ స్థానాల్లో పార్టీకి ఓట్లు పెరిగాయి, ఏ స్థానాల్లో ఓట్లు తగ్గాయనే దానిపైనా దృష్టిసారించింది. విభిన్న నేపథ్యాల అభ్యర్థులకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు తెలుస్తోంది.
మహిళలకు ప్రాధాన్యం..
ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రుల పనితీరుపై పార్టీ సర్వే నిర్వహించినట్లు సమాచారం. పనితీరు సరిగా లేని మంత్రులను మరోమారు కేబినెట్లోకి తీసుకోకూడదని అధిష్ఠానం భావిస్తోంది. అయితే, ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్న నేతలను మంత్రివర్గంలోకి తీసుకుంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. దాంతో పాటు ఈసారి మహిళలకు సముచిత స్థానం కల్పించాలనీ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఇద్దరు కాకుండా ముగ్గురు ఉపముఖ్యమంత్రులను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో ఓ మహిళ నేతకు అవకాశం ఇవ్వనున్నారని సమాచారం.
ముందస్తు సన్నాహాలు..
2024 లోక్‌సభ ఎన్నికల్లో కుల సమీకరణాలు ఏ విధంగా ప్రభావితమవుతాయనే దానిపై ఆధారపడి ఉత్తర్‌ప్రదేశ్ కేబినెట్ కూర్పు ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ సన్నాహాలు మొదలు పెట్టిందా? అన్న ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్. 'మాకు ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ఉంది. విజయం సాధించాక పార్టీ ప్రశాంతంగా కూర్చోదు. నిరంతరం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికలు చాలా పెద్దవి. కొన్ని సందర్భాల్లో పార్టీ ముందస్తు సన్నాహాలు చేస్తుంది. అది చాలా సాధారణమైన విషయం.' అని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైనా విజయంతో సంతృప్తి పడకుండా.. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రధాని మోదీ సూచనలు చేశారని చెప్పారు.