Modi digital rally in UP: భాజపా ఆధ్వర్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీ వర్చువల్ ర్యాలీ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే ఈ సమావేశానికి 50 లక్షల మంది ప్రజలు హాజరవుతారని తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత జరిగే ఈ ర్యాలీ కోసం భాజపా ఐటీ సెల్ నిర్విరామంగా కృషి చేస్తోంది.
BJP social media campaign
భాజపాకు బలమైన సామాజిక మాధ్యమ విభాగాలు ఉన్నాయి. భౌతిక ర్యాలీలపై జనవరి 15 వరకు నిషేధం ఉన్న నేపథ్యంలో వీలైనంత మందికి చేరువయ్యేలా ఆన్లైన్ కార్యక్రమాలు నిర్వహించేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. మోదీ ప్రసంగాన్ని లక్షల మంది వీక్షించేలా పార్టీ డిజిటల్ విభాగం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం అధునాతన సాంకేతికతలను వినియోగిస్తోంది.
Modi 3D rally UP
3డీ ప్రొజెక్షన్ సాయంతో ప్రధాని వర్చువల్ ప్రతిరూపాన్ని రూపొందించేలా కసరత్తులు చేస్తున్నట్లు భాజపా ఐటీ సెల్ వర్గాలు ఈటీవీ భారత్‌తో వెల్లడించాయి. 100-200 మంది హాజరయ్యే భౌతిక సమావేశాల్లో మోదీ డిజిటల్ రూపాన్ని ప్రదర్శించనున్నట్లు తెలిపాయి. సభలకు హాజరైనవారికి.. మోదీ అక్కడే స్టేజీపై నుంచి ప్రసంగించినట్లు కనిపిస్తుందని పేర్కొన్నాయి. ఇలాంటి చిన్న చిన్న సభలను వందల సంఖ్యలో నిర్వహించాలని భాజపా యోచిస్తోందని వివరించాయి..
ఈటీవీ భారత్‌తో రాకేశ్ త్రిపాఠి(భాజపా ఐటీ సెల్) "మోదీ డిజిటల్ ర్యాలీ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 50 లక్షల మంది ఇందులో భాగస్వాములయ్యేలా మేం ప్రయత్నిస్తున్నాం. ర్యాలీ విజయవంతంగా నిర్వహించేందుకు డిజిటల్ సాంకేతికతలను ఉపయోగిస్తున్నాం. ర్యాలీకి హాజరయ్యే వారు మోదీ ప్రసంగాన్ని వినడమే కాకుండా ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని పొందుతారు. మోదీ దిల్లీ నుంచే ప్రసంగిస్తారు కానీ మొత్తం ఉత్తర్‌ప్రదేశ్‌ను ఉద్దేశించి మాట్లాడతారు."
-ఈటీవీ భారత్‌తో భాజపా ఐటీ సెల్ వర్గాలు
EC campaign restrictions in UP
సంక్రాంతి తర్వాత చిన్న సమావేశాలకు ఈసీ అనుమతులు ఇస్తుందనే భావిస్తున్నామని భాజపా ఐటీ సెల్ వర్గాలు చెబుతున్నాయి. స్టేజీలను ఏర్పాటు చేసి తక్కువ మంది ప్రజలతో ఎన్నికల సభలు నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. తద్వారా భౌతిక ర్యాలీలు ఏర్పాటు చేసిన అనుభూతి కలుగుతుందని భావిస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మంది ప్రజలకు చేరువయ్యే వీలుంటుందని చెబుతున్నాయి.
ఇదివరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ భాజపా సాంకేతికతను ఉపయోగించుకొని మెరుగైన ఫలితాలు సాధించింది. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ ఓటర్లను ఆకట్టుకుంది.
BJP house to house campaign UP
మరోవైపు, రాష్ట్రంలో ఇంటింటి ప్రచారాన్ని భాజపా ప్రారంభించింది. యూపీ భాజపా అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్.. లఖ్‌నవూలోని బల్లూ అడ్డా ప్రాంతంలో నివసించే ప్రజలను వారి ఇంటికి వెళ్లి కలిశారు. 'ఆశలు సాకారమయ్యాయి, ప్రతి ఇంటికీ అభివృద్ధి చేరుకుంది' అని రాసిన పార్టీ స్టిక్కర్లను తలుపులకు అంటించారు. ప్రజలకు తమ రిపోర్టు కార్డు అందించి, వారి నుంచి సూచనలు తీసుకుంటున్నామని స్వతంత్ర దేవ్ తెలిపారు. జన విశ్వాస్ యాత్ర ద్వారా ప్రజల ఆశిస్సులు తీసుకున్నామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించామని భాజపా ప్రతినిధి రాకేశ్ త్రిపాఠి తెలిపారు. మంత్రులు, పార్టీ ఎంపీలు ఇందులో పాల్గొన్నారని వెల్లడించారు.
యోగి, షా భేటీ
మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిల్లీలో మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు. తొలి దశల్లో ఎన్నికలు జరిగే స్థానాలకు అభ్యర్థులను పార్టీ షార్ట్‌లిస్ట్ చేసిన నేపథ్యంలో వీరి భేటీ జరగడం విశేషం. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, యూపీ భాజపా అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. కరోనా బారిన పడ్డ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. వర్చువల్‌గా భేటీలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: