దిల్లీలో మెడికల్ ఆక్సిజన్ సరఫరాపై రాజకీయంగా వివాదం నెలకొంది. ఈ విషయంలో దిల్లీ సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది భాజపా. కరోనా రెండో దశలో అవసరానికి మించి నాలుగు రెట్లు ఆక్సిజన్‌ను సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేసినట్లు ఆరోపించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదికను ఉటంకిస్తూ.. విమర్శలు గుప్పించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ధ్వజమెత్తింది.
కరోనా రెండోదశ ఉద్ధృతిలో దిల్లీ ప్రభుత్వానికి 209 మెట్రిక్ టన్నుల సరిపోయినప్పటికీ.. 1,140 మెట్రిక్‌టన్నుల(ఎంటీ) ఆక్సిజన్ డిమాండ్ చేసిందని ఆరోపించారు భాజపా ప్రతినిధి సంబిత్ పాత్రా. ఆ దశలో దిల్లీ ప్రభుత్వానికి 351 ఎంటీలు అవసరమని సుప్రీంకోర్టు కమిటీ అంచనా వేయగా.. కేంద్ర ప్రభుత్వం 289 ఎంటీలు చాలని పేర్కొందన్నారు.
"209 ఎంటీలు వినియోగించిన దిల్లీ ప్రభుత్వం.. 1,140 ఎంటీలు డిమాండ్ చేసింది. కేజ్రీవాల్ ఎంత దారుణానికి ఒడిగట్టారో.. దీని ఆధారంగానే ఊహించుకోవచ్చు. అవసరమైన దానికంటే నాలుగు రెట్లు డిమాండ్ చేశారని ప్యానెల్ చెబుతోంది. కరోనా నిర్వహణలో విఫలమైన కేజ్రీవాల్.. ప్రజల దృష్టిని మళ్లించడానికే రాజకీయాలు చేస్తున్నారు." అని అన్నారు సంబిత్ పాత్రా.
ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని.. అందుకు కేజ్రీవాల్ బాధ్యులని.. ఆయన్ను సుప్రీంకోర్టు శిక్షిస్తుందన్నారు సంబిత్. కేజ్రీవాల్ అబద్ధాల కారణంగా దిల్లీ అవసరాలను తీర్చడానికి.. ఆక్సిజన్ సరఫరాను మళ్లించడం వల్ల 12 రాష్ట్రాలు ప్రభావితమయ్యాయని ఆయన ఆరోపించారు.