భాజపాపై మరోమారు విరుచుకుపడ్డారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. భాజపాను.. కేవలం మీడియా కోసమే పనిచేసే ఓ గ్యాస్ బెలూన్ అని అభివర్ణించారు. దురుద్దేశాలు ఉన్న వారికి డబ్బులు అందించే ఓ వాషింగ్ మెషిన్ అని పేర్కొన్నారు.
కోల్‌కతా నేతాజీ ఇండోర్ స్టేడియంలో.. ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైజ్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో పాల్గొన్నారు మమత. ఇంతకాలం పోగు చేసుకున్న సొమ్ములను భద్రపరుచుకునేందుకే నేతలు తృణమూల్‌ను వీడి భాజపాలో చేరుతున్నారని ఆరోపించారు. ఒకవేళ వారు పార్టీలో ఉన్నా.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వారికి టికెట్ ఇవ్వకూడదని తాను నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు.
"ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో మళ్లీ అధికారం చేపడతాం. భాజపా ఓ గ్యాస్ బెలూన్.. కేవలం మీడియా కోసమే పనిచేస్తుంది. వారి దగ్గర డబ్బులున్నాయి. వీధుల్లో జెండాలను ఎగరేసేందుకు ఏజెన్సీలను ఉపయోగించుకుంటున్నారు. వారిని అలాగే ఉండి వార్తల్లో నిలవనివ్వండి. ప్రజల గుండెల్లో టీఎంసీ ఉంటుంది. మీరు(ప్రజలు) నాకు ఈ మాట ఇవ్వండి.. నేను మీకు మంచి భవిష్యత్తును ఇస్తాను. దోపిడీదారులు ఇంతకాలం డబ్బులను దోచుకున్నారు. ఇప్పడు భాజపా అనే వాషింగ్ మెషిన్ దగ్గరకు వెళ్లి.. నల్ల ధనాన్ని న్యాయపరమైన సొమ్ములుగా మర్చుకుంటున్నారు. అంతే! దానికి మించి అక్కడ ఏమీ లేదు."
-- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి.