Bittu Bajrangi Brother Dead :హరియాణాకు చెందిన గో సంరక్షకుడు, నూహ్ అల్లర్ల కేసు నిందితుడు బిట్టూ బజరంగీ సోదరుడు మహేశ్ పాంచల్ దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడు. గతేడాది డిసెంబర్లో దుండగుల దాడిలో మహేశ్‌కు కాలిన గాయాలు అయ్యాయని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వాదనను పోలీసులు ఖండిస్తున్నప్పటికీ- కొందరు దుండగులు మహేశ్ ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారని చెబుతున్నారు. కాలిన గాయాలకు చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 8 గంటలకు ప్రాణాలు కోల్పోయాడని బిట్టూ బజరంగీ వివరించాడు. అయితే, అతడి మృతిపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఫరీదాబాద్ పోలీసులు తెలిపారు.
"డిసెంబర్ 13 అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇంటికి వస్తుండగా కొందరు నన్ను అడ్డగించారు. 'నువ్వు బిట్టూ బజరంగీ సోదరుడివేనా?' అని అడిగారు. అవును అని నేను చెప్పగానే దాడి చేశారు. నా ఒంటిపై పెట్రోల్ చల్లి నిప్పంటించారు. ఒంటికి మంటలు అంటుకున్నా అరుస్తూనే ఇంటికి వచ్చా. గట్టిగా గేటును కొట్టాను. వెంటనే కుటుంబ సభ్యులంతా గేటు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు" అని దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స సందర్భంగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు మహేశ్.
కాలిన గాయాలతో ఉన్న మహేశ్‌కు ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు బాద్షా ఖాన్ ఆస్పత్రికి సిఫార్సు చేశారని అతడి కుటుంబీకులు తెలిపారు. అక్కడి నుంచి దిల్లీ ఎయిమ్స్‌కు తరలించినట్లు చెప్పారు. మహేశ్ ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు దిగజారుతూ వచ్చిందని, చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు.