గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా స్మారకార్థం ఝార్ఖండ్ (Jharkhand Birsa Munda) రాజధాని రాంచీలో ఏర్పాటు చేసిన మ్యూజియంను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న ఈ సమయంలో.. గిరిజన యోధుల సాహసాలు, వారి సంప్రదాయాలకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. బిర్సా ముండా జయంతి (Birsa Munda jayanti) అయిన నవంబర్ 15ను ఇక నుంచి ఏటా 'జనజాతీయ గౌరవ్ దివస్'గా జరుపుకోనున్నట్లు ప్రధాని మోదీ (PM Mమోodi news) ప్రకటించారు.
"నా జీవితంలో చాలా వరకు గిరిజన సోదరసోదరీమణులు, గిరిజన చిన్నారులతోనే గడిపాను. వారి కష్టసుఖాలను దగ్గరుండి చూశాను. వారి జీవనవిధానం, వారి అవసరాలు అన్నీ నాకు తెలుసు. కాబట్టి వ్యక్తిగతంగా ఈరోజు నాకు చాలా ప్రత్యేకం. ఆజాదీకా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న ఈ సమయంలో.. గిరిజన వీరులకు, వారి సంప్రదాయాలకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని దేశం భావిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15ను ఇక నుంచి ఏటా 'జనజాతీయ గౌరవ్ దివస్'గా నిర్వహించుకుందాం."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ దృఢ సంకల్పం వల్లే ఝార్ఖండ్ రాష్ట్రం ఆవిర్భవించిందని మోదీ పేర్కొన్నారు. గిరిజన వ్యవహారాల శాఖను ఏర్పాటు చేసింది కూడా ఆయనే అని గుర్తు చేశారు. ఝార్ఖండ్ ఆవిర్భావ దినోత్సవం (Jharkhand Foundation day) సందర్భంగా వాజ్పేయీకి సైతం నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు.