పక్షులను ఆదుకోవడమే లక్ష్యంగా పంజాబ్‌లోని ఓ పురాతన గోశాల నిర్వాహకులు ప్రత్యేక ఆస్పత్రి నిర్మించారు. పావురాలు, చిలకలు, పిచ్చుకల లాంటి అనేక పక్షులకు వైద్య సేవలు అందిస్తున్నారు. పక్షులు ఎగిరి పోయేంత ఆరోగ్యంగా ఉంటేనే వాటిని తిరిగి స్వేచ్ఛగా వదిలేస్తున్నారు. అలా లేని వాటిని వారి సంరక్షణలోనే ఉంచుకుని కొన్ని వేల పక్షులకు సేవ చేస్తున్నారు. లుధియానా గోషాల నిర్వాహకులు.. ఇందుకోసం కొంతమంది జంతుప్రేమికుల దగ్గర్నుంచి విరాళాలు సేకరిస్తుంటారు.
విరాళాలను ఉపయోగించి తీవ్ర అనారోగ్యంలో ఉన్న పావురాలు, పిచ్చుకలు, చిలుకల కోసం ఏకంగా ఓ ఐసీయూ వార్డునే ఏర్పాటు చేశారు. ఇళ్లలో పెంచుకునే పక్షులతోపాటు నిస్సహాయ స్థితిలో ఉన్న పక్షులను ఎవరైన తీసుకొస్తే ఎలాంటి రుసుము తీసుకోకుండా చికిత్స చేస్తారు. పక్షుల కోసం ఆస్పత్రి ప్రాంగణంలో తిండి గింజలు, నీటిని ఏర్పాటు చేశారు. వాటి కోసం వచ్చిన పక్షుల్లో ఏవైనా జబ్బుపడి ఉంటే వాటికీ చికిత్స చేస్తారు.