దేశంలో బర్డ్ ఫ్లూ ఆందోళన పెరుగుతోన్న నేపథ్యంలో.. ఇప్పటివరకు ఆరు రాష్ట్రాల్లోనే ఈ వ్యాధి నిర్ధరణ అయినట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, గుజరాత్‌లోనే ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ నిర్ధరణ జరిగినట్లు పేర్కొంది. ముందస్తు ప్రణాళిక ప్రకారం, వ్యాధిని కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని సూచించింది.
ఇక దేశరాజధాని దిల్లీలోనూ 16 పక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు కేంద్రం వెల్లడించింది. పరీక్షల నిమిత్తం వాటి నమూనాలను ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపింది. కేరళలో వ్యాధి బయటపడిన రెండు జిల్లాల్లో పక్షులను వధించే ప్రక్రియ పూర్తయిందని, ప్రస్తుతం క్రిమిసంహారక ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొంది. హరియాణాలో రెండు కోళ్ల ఫాంలలో దీన్ని గుర్తించగా, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాకుల్లో ఎక్కువగా ఈ వ్యాధి బయటపడినట్లు తెలిపింది. ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్‌ఫ్లూయంజా) సోకని రాష్ట్రాల్లోనూ పక్షుల అనుమానాస్పద మరణాలను గుర్తిస్తే, వెంటనే తెలియజేయాలని సూచించింది. తద్వారా సాధ్యమైనంత తక్కువ సమయంలో వ్యాధి కట్టడి చేయవచ్చని స్పష్టం చేసింది.
బర్డ్‌ఫ్లూ ప్రభావిత రాష్ట్రాలైన కేరళ, హరియాణా, హిమాచల్ ప్రదేశ్‌ల్లో పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను కేంద్రం పంపించింది. బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో అటు పౌల్ట్రీ యాజమానులు, ప్రజల్లో ఆందోళనలను తొలగించేందుకు ఆయా రాష్ట్రాలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర పశుసంవర్థక మంత్రిత్వశాఖ వెల్లడించింది.
- హరియాణాలో గత నెలలో 4లక్షల కోళ్లు మరణించినట్లు రాష్ట్ర మంత్రి జేపీ దలాల్ తెలిపారు. వివిధ పౌల్ట్రీ పరిశ్రమల నుంచి నమూనాలు సేకరించి మధ్యప్రదేశ్‌లోకి ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు.
- హరియాణా గురుగ్రామ్‌లోని తావు దేవీ లాల్ పార్క్‌లో శుక్రవారం ఉదయం 5 కాకులు మరణించిన అధికారులు తెలిపారు. దీనికి కారణమేంటో తెలుసుకునేందుకు వాటి నమూనాలను ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు.
- బర్డ్‌ఫ్లూ భయాల నేపథ్యంలో దిల్లీలో గత నాలుగు రోజుల్లో 50 పక్షులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మయూర్ విహార్ ఫేజ్ 3లో 100కు పైగా కాకులు మరణించడంతో వైద్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీటి నమూనాలను సేకరించి పంజాబ్‌లోని జలంధర్ ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు. వీటితో పాటు వివిధ పౌల్ట్రీ పరిశ్రమల నుంచి సేకరించిన నమూనాలను కూడా పంపినట్లు వెల్లడించారు. దిల్లీలో ఇప్పటివరకు ఒక్క బర్డ్‌ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదని, అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చెప్పారు.
- దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.