తెలంగాణ

telangana

ETV Bharat / bharat

''ఉగ్రవాదానికి అడ్డాగా బంగాల్​'.. 'లొంగిపోకుంటే వేటాడతాం'' - బీర్భుమ్​ సజీవదహనం

Birbhum Killings: బంగాల్​ బీర్భుమ్​ ఘటనపై అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. దీదీ హయాంలో రాష్ట్రం ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని భాజపా ఆరోపించింది. బంగాల్​లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్​ చేసింది. సంఘటనా స్థలాన్ని భాజపా బృందం పరిశీలించింది. మరోవైపు.. కేంద్ర హోం మంత్రి అమిత్​ షాను కలిసి రాష్ట్ర గవర్నర్​ను తొలగించాలని తృణమూల్​ కాంగ్రెస్​ బృందం కోరింది. ఘటనా స్థలానికి వెళ్లిన సీఎం మమతా బెనర్జీ.. మృతుల కుటుంబాలకు సాయం ప్రకటించారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.

Birbhum killings
Birbhum killings

By

Published : Mar 24, 2022, 7:28 PM IST

Birbhum Killings: బంగాల్​లో బీర్భుమ్​ సజీవ దహనాల ఘటనపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. అధికార తృణమూల్​ కాంగ్రెస్​పై.. భాజపా, కాంగ్రెస్​ మాటలతో విరుచుకుపడుతున్నాయి. ఈ ఘటన మొత్తం నాజీ నిర్బంధ శిబిరాన్ని తలపిస్తోందని, బంగాల్​ సీఎం మమతా బెనర్జీ క్రూరంగా కనిపిస్తున్నారని భాజపా ఆరోపించింది. రాష్ట్రంలో మానవత్వం మట్టిలో కలిసిందని విమర్శించిన భాజపా ప్రతినిధి సంబిత్​ పాత్రా.. బంగాల్​లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్​ చేశారు.

పార్లమెంట్​లో మాటలయుద్ధం: బంగాల్​ ఘటనపై పార్లమెంట్​లో హోరాహోరీ వాదనలు నడిచాయి. తృణమూల్​ కాంగ్రెస్​ బృందం.. కేంద్ర హోం మంత్రి అమిత్​ షాను కలిసి బంగాల్​ గవర్నర్​ను తొలగించాలని కోరింది. ఆయన రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని ఆరోపించింది. అంతకుముందు లోక్​సభలో భాజపా ఎంపీ సౌమిత్రా ఖాన్​ వెల్​లోకి దూసుకెళ్లారు. బంగాల్​ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్​ నేతలను ఘటనా స్థలానికి అనుమతించట్లేదని గౌరవ్​ గొగొయి విమర్శించారు.

అమిత్​ షా ను కలిసిన తృణమూల్​ కాంగ్రెస్​ బృందం

బీర్భుమ్​ ఘటనను తీవ్రంగా పరిగణించిన బంగాల్​ ప్రభుత్వం 10 రోజుల స్పెషల్​ క్లీన్​-అప్​ డ్రైవ్​కు ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల వద్ద అక్రమంగా ఉన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని వెలికితీయాలని స్పష్టం చేసింది. రాంపుర్​హట్​-1 బ్లాక్ తృణమూల్​ కాంగ్రెస్​​ ప్రెసిడెంట్ అనారుల్​ హొస్సేన్​ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బోగ్​తుయీ గ్రామంలో ప్రజల భయాందోళనను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆయనను పట్టుకోవాలని సీఎం ఆదేశించిన గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. హొస్సేన్​ నివాసం సహా జిల్లాలోని పలుచోట్ల సోదాలు నిర్వహించారు. ఘటనకు సంబంధించి ఆయనను ప్రశ్నించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే నిర్లక్ష్యంగా ఉన్నందుకు.. రాంపుర్​హట్​ స్టేషన్​ ఇన్​స్పెక్టర్​ ఇన్​ఛార్జ్​ త్రిదిబ్​ ప్రామాణిక్​ను సస్పెండ్​ చేశారు అధికారులు.

దోషుల్ని శిక్షిస్తాం:నిందితులను కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. లొంగిపోకుంటే వేటాడి పట్టుకుంటామని హెచ్చరించారు. బోగ్​తుయీలో సంఘటన జరిగిన స్థలాన్ని సందర్శించిన దీదీ.. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆ కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించారు. ధ్వంసమైన ఇళ్లను పునఃనిర్మించుకునేందుకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేల పరిహారం ఇచ్చారు.

బోగ్​తుయీ గ్రామంలో సీఎం మమతా బెనర్జీ
మృతుల కుటుంబాలకు చెక్కులు అందజేస్తున్న సీఎం మమతా బెనర్జీ

బీర్భుమ్​ ఘటనపై భాజపా ఏర్పాటు చేసిన నిజనిర్ధరణ కమిటీ బోగ్​తుయీ గ్రామాన్ని సందర్శించింది. స్థానికులతో, బాధితుల బంధువులతో మాట్లాడి కమిటీ సభ్యులు వివరాలు తెలుసుకున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ఓవైపు నిందితులను శిక్షిస్తామని చెబుతూనే.. మరోవైపు పోలీసులతో సాక్ష్యాలను మాయం చేసేందుకు యత్నిస్తోందని ఆరోపించారు కమిటీ సభ్యులు.

స్థానికులతో మాట్లాడుతున్న భాజపా బృందం

ఎన్​హెచ్​ఆర్​సీ నోటీసులు:బీర్భుమ్​ ఘటన నేపథ్యంలో.. బంగాల్​ ప్రభుత్వం, రాష్ట్ర డీజీపీకి నోటీసులు పంపించింది జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్​హెచ్​ఆర్​సీ). నాలుగు వారాల్లో నివేదికను అందజేయాలని కోరింది. ప్రజల భద్రత కోసం తీసుకున్న చర్యలను సమగ్రంగా వివరించాలని అందులో పేర్కొంది. బీర్భుమ్​ జిల్లా రాంపుర్​హట్​ ప్రాంతంలో మంగళవారం.. కొందరు దుండగులు ఇళ్లకు నిప్పుపెట్టగా 8 మంది సజీవదహనమయ్యారు. ఇందులో ఇద్దరు చిన్నారులున్నారు. మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. తృణమూల్​ కాంగ్రెస్​ నేత, బర్షాల్​ గ్రామ పంచాయతీ డిప్యూటీ చీఫ్​ బహదూర్​ షేక్​ను సోమవారం ఎవరో హత్యచేశారు. దీంతో రెచ్చిపోయిన ఆయన అనుచరులు.. రాంపుర్​హట్​లోని 5 ఇళ్లకు నిప్పుపెట్టారు. అయితే.. హత్యకు ముందు వారిని తీవ్రంగా కొట్టినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. ఆ తర్వాత వారిని సజీవ దహనం చేసినట్లు పేర్కొంది.

ఇవీ చూడండి:భార్యలను మార్చుకున్న స్నేహితులు.. చివరకు దిమ్మతిరిగే షాక్​

రైలు పట్టాలపై దూకి ఆత్మహత్యాయత్నం- కానిస్టేబుల్ సాహసం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details