Cyclone Biporjoy : గురువారం బిపోర్‌జాయ్ తుపాను తీరాన్ని దాటనున్న వేళ.. అరేబియా సముద్రంలో భారీ ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో గాలులు వీస్తున్నాయి. వర్షాలు సైతం భారీగానే పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం గుజరాత్‌లోని కచ్, దక్షిణ పాకిస్థాన్ వైపుగా బిపోర్‌జాయ్ తుపాను.. తన దిశను మార్చుకుందని ఐఎండీ తెలిపింది. అది జఖౌ పోర్టుకు సమీపంలో తీరాన్ని దాటనుందని పేర్కొంది. తుపాను గమనం మందగించిందని, దాదాపు ఆగిపోయిందని.. దీనిని బట్టి అది దిశను మార్చుకుంటోందనే విషయం అర్థమవుతుందని ఐఎండీ వివరించింది.
గురువారం సాయంత్రం దాదాపు 5.30 గంటల ప్రాంతంలో బిపోర్జాయ్తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. సౌరాష్ట్ర, కచ్‌లను బిపోర్‌జాయ్ తాకి.. మాండవి, కరాచీల మధ్య జఖౌ సమీపంలో తీరాన్ని దాటనుందని పేర్కొంది. ప్రస్తుతం కచ్‌కు 290 కిలోమీటర్ల దూరంలో తుపాను ఉందని తెలిపింది. కాగా గుజరాత్.. జునాగఢ్ జిల్లాలో సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. మంగ్రోల్ ప్రాంతాల్లో ఇళ్లలోకి సముద్ర నీళ్లు ప్రవేశించాయి.
8 రాష్ట్రాల్లో ప్రభావం..
Biporjoy Cyclone Affected Areas : బిపోర్‌జాయ్ తుపాను ప్రభావంతో గుజరాత్‌తోపాటు మరో 8 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా రాష్ట్రాలతో పాటు దమణ్ దీవ్, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలీ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి.
145 కి.మీ వేగంతో గాలులు..
తుపాను కాస్త బలహీనపడిందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు. అయినా గుజరాత్‌కు ముప్పు పొంచే ఉందని ఆయన వివరించారు. గురువారం అది తీరాన్ని దాటే సమయంలో 145 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలలో కెరటాలు 2 నుంచి 3 మీటర్ల ఎత్తువరకూ ఎగిసిపడతాయని వెల్లడించారు. రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లోనూ వర్షాలు పడతాయని మృత్యుంజయ్ వివరించారు.
భారీగా తీర ప్రాంతాల ప్రజల తరలింపు..
Biporjoy Cyclone Evacuation : తుపాను ముప్పుతో గుజరాత్ తీర ప్రాంతాల్లో ఉన్న సుమారు 74వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొంనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత సైన్యం వెల్లడించింది. తీర ప్రాంత జిల్లాల్లో సహాయక చర్యలకు 18 ఎన్‌డీఆర్‌ఎఫ్, 12 ఎస్‌డీఆర్‌ఎఫ్, 115 రోడ్లు- భవనాల సిబ్బంది, 397 విద్యుత్తు బృందాలతో అప్రమత్తమంగా ఉన్నామని అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల్లోని నాలుగు వేల హోర్డింగ్‌లను తొలగించిట్లు వారు పేర్కొన్నారు.
అటు మహారాష్ట్రలోనూ 14 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. ముంబయిలో 5 బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. నేవీ సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచినట్లు వారు వెల్లడించారు. పలు రైళ్లను సైతం రద్దు చేసినట్లు వారు పేర్కొన్నారు. కాగా ఉదయం 10.30 గంటల నుంచి ముంబయిలో భారీ ఎత్తున అలలు సంభవిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
అధికారుల సమీక్షలు..
తుపాను పరిస్థితులపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్య శాఖ మంత్రి మున్సుఖ్ మాండవీయ వేరువేరుగా సమీక్షలునిర్వహించారు. సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆలయాల మూసివేత..
తుపాను నేపథ్యంలో గుజరాత్‌లోని తీర ప్రాంతాల్లో ఉన్న ఆలయాలు, పార్థన మందిరాలను గురువారం మూసివేయించారు అధికారులు. గిర్ సోమనాథ్ జిల్లా.. దేవభూమి ద్వారకలోని ద్వారకాధీశ్ ఆలయాన్ని కూడా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. రోజువారి పూజలను.. పండితులు ఆలయంలోనే నిర్వహిస్తారని వారు వెల్లడించారు. ఆ కార్యక్రమాలను ఆలయ వెబ్సైట్లలో భక్తులు లైవ్‌లో చూడొచ్చని తెలిపారు.
పాకిస్థాన్ ప్రభుత్వ అప్రమత్తం..
Biporjoy Cyclone Pakistan : బిపోర్‌జాయ్ తుపాను నేపథ్యంలో పాకిస్థాన్‌లోని తీర ప్రాంత పట్టణాలు, అరేబియా దీవుల్లో ఉన్న 71,380 మందిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు అధికారులు. బలమైన గాలులు, వర్షాలు, కెరటాల తాకిడితో భారీ నష్టం సంభవించవచ్చనే అంచనాలతో ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు. పాక్‌లోనూ 170 కిలోమీటర్ల వేగంతో గాలులువీయవచ్చని అక్కడి అధికారులు తెలిపారు.