Cyclone Biporjoy Current Status : అత్యంత తీవ్ర తుఫాన్ బిపోర్‌జాయ్.. కచ్ జిల్లా జఖౌ ఓడరేవు సమీపంలో తీరం దాటే ప్రక్రియ మొదలైంది. దట్టమైన మేఘాలు.. కచ్, సౌరాష్ట్ర జిల్లాల్లో ప్రవేశించటం వల్ల.. తుఫాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైనట్లుగా కేంద్ర వాతావరణ విభాగం చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. ఈ ప్రక్రియ గురువారం అర్ధరాత్రి వరకు కొనసాగుతుందని చెప్పారు. బిపోర్‌జాయ్ తుఫాన్ కన్ను వ్యాసార్థం 50కిలోమీటర్లు ఉన్నట్లు తెలిపారు. 13 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ తీరం వైపు పయనిస్తున్నట్లు మహాపాత్ర వివరించారు. తుఫాన్ కన్ను పూర్తిగా తీరం దాటే వరకు దాదాపు 5గంటలు పడుతుందన్నారు. కచ్ జిల్లాలోని జఖౌ ఓడరేవు సమీపంలో.. మాండ్వి పాకిస్థాన్లోని కరాచీ మధ్య తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్ ప్రభావంతో.. ఆయాప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతోపాటు గంటకు 115కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అరేబియా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలలు రెండుమూడు మీటర్ల ఎత్తులో ఎగిసిపడుతున్నాయి.
బిపోర్ జాయ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. దేవభూమి జిల్లాలో వృక్షాలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. కచ్ జిల్లాలోని జఖౌ, మాండ్వి పట్టణాల్లో అనేక చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. రాకాసి గాలుల బీభత్సానికి అమ్రేలిలోని మోరంగిలో 100 ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఈ పైకప్పులు పడడం వల్ల పలువురు గాయపడ్డారు. వివిధ ప్రాంతాల్లో నేలకూలిన చెట్లు, విద్యుత్తు స్తంభాలను.. తొలగించేపనిలో గుజరాత్ పోలీసులు, NDRF, సైన్యం.. నిమగ్నమయ్యాయి. ద్వారక, ఒఖా, నాలియా, భుజ్, పోరుబందర్, కాండ్లసహా తీరానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.