Bipin Rawat helicopter video: తమిళనాడు కూనూర్‌లో ఈనెల 8న వాయుసేనకు చెందిన హెలికాప్టర్ కూలిపోయి భారత తొలి త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. చాపర్ ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు తీసిన ఓ వీడియో ఆ మరుసటి రోజున బయటకు వచ్చింది. ఈ వీడియోను కోయంబత్తూర్‌లోని రామనంతపురానికి చెందిన వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ వై.జో అలియాస్ కుట్టి అనే వ్యక్తి తన ఫోన్లో రికార్డు చేశారు. ఆ సమయంలో ఏం జరిగింది? అనే విషయంపై ఈటీవీ భారత్‌తో మాట్లాడారు జో. ప్రతికూల వాతావరణం, సరైన వెలుతురు లేకపోవటమే హెలికాప్టర్ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని చెప్పారు.
"ఆ రోజున నా స్నేహితుడు నాసర్, నేను, నా కుటుంబంతో కలిసి ఊటీ సమీపంలోని కట్టేరి ప్రాంతాన్ని చూసేందుకు వెళ్లాం. కొండ ప్రాంతంలోని రైల్వే ట్రాక్‌పై వెళ్తూ వీడియో తీస్తున్నాం. అప్పుడే హెలికాప్టర్‌ను చూశాం. దాని శబ్దం కొంచెం తేడాగా అనిపించి.. వీడియో తీసేందుకు ప్రయత్నించగా కొన్ని క్షణాల్లోనే కనిపించకుండా పోయింది. ఆ వెంటనే భారీ పేలుడు శబ్దం వినపడింది. ఇది కేవలం 4-5 సెకన్లలోనే జరిగిపోయింది. ఘటనాస్థలానికి వెళ్లేందుకు ప్రయత్నించాం. కానీ, పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. సమీపంలోని మా స్నేహితుడి ఇంటికి వెళ్లాం. ఆ తర్వాత హెలికాప్టర్ ప్రమాదంపై పూర్తి వివరాలు టీవీలో చూసి తెలుసుకున్నాం. "
- జో, కోయంబత్తూర్
వీడియో అందించేందుకు ముందుగా నీలగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లామని, అక్కడ అధికారులెవరూ లేరని గుర్తు చేసుకున్నారు జో. ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లాలని అక్కడ ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు సూచించగా.. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని ఇన్స్పెక్టర్ దేవరాజన్‌కు వీడియో ఫుటేజ్‌ను అందించినట్లు చెప్పారు. దట్టమైన పొగ మంచులో వెళుతున్న హెలికాప్టర్‌ను చూశామని, ఆ వెంటనే కూలిపోయిన శబ్దం విన్నట్లు పోలీసులకు వివరించామన్నారు.