Biporjoy Cyclone Gujarat : బిపోర్‌జాయ్ అతి తీవ్ర తుపాను.. గుజరాత్ కచ్ ప్రాంతంలోని కోట్ లఖ్‌పత్ సమీపంలో గురువారం రాత్రి తీరాన్ని దాటింది. ఇది పూర్తిగా తీరాన్ని దాటేందుకు దాదాపు 6 గంటల సమయం పట్టిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుపాను ప్రభావంతో గుజరాత్ తీరంలో భీకర గాలులు వీస్తున్నాయి. కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. కచ్ సమీపంలోని జఖౌ వద్ద సాయంత్రానికే పెనుతుపాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ తొలుత అంచనా వేసింది. తుపాను వేగం తగ్గటం వల్ల తీరాన్ని తాకడానికే ఆలస్యమైంది. బిపోర్‌జాయ్ తుపాను కేంద్రం దాదాపు 50 కిలోమీటర్ల వ్యాసంతో ఉందని చెప్పారు. మునుపటి అంచనాలను తలకిందులు చేస్తూ కేవలం 48 గంటల్లోనే.. ఈ తుపాను తీవ్రరూపం దాల్చింది. అరేబియాలో పది రోజులకుపైగా కొనసాగిన తొలి తుపానుగా ఇది నిలిచిపోనుంది.
తుపాను ప్రభావంతో కచ్, జామ్‌నగర్, రాజ్‌కోట్, పోర్‌బందర్, దేవ్‌భూమి ద్వారక, ఆమ్రేలీ సహా పలు ప్రాంతాల్లో... భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం కూడా వర్షాలు కొనసాగనున్నాయి. సౌరాష్ట్ర, కచ్ తీరాలతోపాటు దమణ్ ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భీకర గాలుల కారణంగా కచ్ జిల్లాలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, వృక్షాలు కూలిపోయాయి. పలు ప్రాంతాల్లో.. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భావ్‌నగర్ జిల్లాలో.. వరద నీటి నుంచి తమ మేకలను కాపాడే ప్రయత్నంలో తండ్రి-తనయుడు ప్రాణాలు కోల్పోయారు. తుపాను తీరం దాటిన పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ముందుజాగ్రత్త చర్యగా దాదాపు 20 తీరప్రాంత గ్రామాలకు చెందిన లక్ష మంది ప్రజలను.. ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ద్వారకలోని సుప్రసిద్ధ ప్రాచీన ఆలయం సహా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేశారు. 18 NDRF, 12 SDRF బృందాలతో పాటు.. రహదారులు-భవనాలు, విద్యుత్ శాఖలకు చెందిన బృందాలను.. సహాయక చర్యల్లో మోహరించారు. తుపాను కారణంగా రైల్వేశాఖ 76 రైళ్లను రద్దు చేసింది.