తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిల్కిస్ బానో దోషులకు క్షమాభిక్ష రద్దు- రెండు వారాల్లో లొంగిపోవాలని సుప్రీం ఆదేశం - bilkis bano convicts case

Bilkis Bano Supreme Court : బిల్కిస్ బానోపై అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో 11 మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం ప్రసాదించిన క్షమాభిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దోషులు రెండు వారాల్లోగా జైలు అధికారుల ముందు లొంగిపోవాలని స్పష్టం చేసింది.

Bilkis Bano Supreme Court
Bilkis Bano Supreme Court

By PTI

Published : Jan 8, 2024, 11:00 AM IST

Updated : Jan 8, 2024, 4:01 PM IST

Bilkis Bano Supreme Court :బిల్కిస్ బానోపై అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో 11 మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం ప్రసాదించిన క్షమాభిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. క్షమాభిక్ష ఉత్తర్వులు జారీ చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది. ఈ అధికారం మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొంది. "దోషికి సంబంధించిన విచారణ, జైలు శిక్ష విధింపు ఎక్కడైతే జరిగిందో అక్కడే క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది" అని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్​తో కూడిన అత్యున్నత ధర్మాసనం సోమవారం తీర్పు చెప్పింది. 11 మంది దోషులు రెండు వారాల్లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.

'బుద్ధి ఉపయోగించలేదు'
క్షమాభిక్ష నిర్ణయంపై పునరాలోచన చేయాలని గుజరాత్ ప్రభుత్వానికి గతంలో (2022 మే 13న) తాము ఇచ్చిన ఆదేశాలు చెల్లవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 'మోసపూరితం'గా, వాస్తవాలను దాచిపెట్టి ఆ ఉత్తర్వులు సంపాదించుకున్నారని పేర్కొంది. గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు ఇది వ్యతిరేకంగా ఉందని తెలిపింది. 'బుద్ధి ఉపయోగించకుండానే దోషులకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు' అంటూ గుజరాత్ సర్కారుపై మండిపడింది.

'బీజేపీవి మహిళా వ్యతిరేక విధానాలు'
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించింది. మహిళల పట్ల బీజేపీ ఆలోచన ఎలా ఉందనేందుకు ఈ తీర్పు ఓ ఉదాహరణ అని పేర్కొంది. బీజేపీ మహిళా వ్యతిరేక విధానాలపై ఉన్న పరదాను కోర్టు తొలగించి చూపించిందని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. ఈ తీర్పుతో న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుందన్నారు. మహిళల పట్ల బీజేపీ నిర్లక్ష్యానికి సుప్రీంకోర్టు తీర్పు అద్దం పడుతుందని కాంగ్రెస్ మీడియా హెడ్ పవన్ ఖేడా ధ్వజమెత్తారు. చట్టవిరుద్ధంగా దోషులను విడుదల చేసి, పూలమాలలతో గౌరవించిన వారికి ఈ తీర్పు చెంపపెట్టు అని అన్నారు. బాధితులు లేదా నిందితుల మతం, కులం ఆధారంగా న్యాయం ప్రసాదించే వ్యవస్థను ఈ దేశం అనుమతించదని ట్వీట్ చేశారు.

'నేరస్థులకు ఎవరు అండగా ఉంటున్నారో స్పష్టమైంది'
బిల్కిస్​ బానో కేసులో 11 మంది దోషులకు గుజరాత్​ ప్రభుత్వం ప్రసాదించిన క్షమాభిక్షను సుప్రీం కోర్టు కొట్టేవేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. నేరస్థులకు ఎవరు అండగా ఉంటారనే విషయాన్ని సుప్రీం కోర్టు తీర్పు స్పష్టం చేసిందని అన్నారు. ఈ క్రమంలో అధికార బీజేపీ మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఎక్స్​లో పోస్ట్​ చేశారు.

"ఎన్నికల ప్రయోజనాలు కోసం 'మర్డర్ జస్టిస్' అనే ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం. ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేరస్థులను ఎవరు ప్రోత్సహిస్తారో మరోసారి దేశానికి చాటిచెప్పింది"
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

మరోవైపు, బిల్కిస్​ బానో కేసులో సుప్రీం కోర్టు తీర్పు బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ అని ఆర్​జేడీ నేత మృత్యుంజయ్ తివారీ అన్నారు. నిందితులను విడుదల చేసిన విధానమే అందుకు కారణం అని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పును సీపీఐ సీనియర్ నేత బృందా కారాత్ స్వాగతించారు. ఈ తీర్పు కనీసం న్యాయంపై కొంతమేర నమ్మకాన్ని కలిగించిందన్నారు. మరోవైపు, సుప్రీం కోర్టు తీర్పును బిల్కిస్​ బానో మద్దతుదారులు స్వాగతించారు. గుజరాత్​లోని దేవ్​గఢ్​ బారియాలోని ఆమె ఇంటి ముందు బాణసంచా కాల్చారు.

ఇదీ వివాదం
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో 21ఏళ్ల బిల్కిస్ బానోపై అత్యాచారం జరిగింది. ఐదు నెలల గర్భిణీ అయిన ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు దుండగులు. అల్లర్లలో మూడేళ్ల కుమార్తె సహా బిల్కిస్ కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అత్యాచార ఘటనలో దోషులుగా తేలిన 11 మందికి జీవితఖైదు శిక్ష పడింది. కాగా, గుజరాత్ ప్రభుత్వం వారిని 2022 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది. క్షమాభిక్ష ప్రసాదించి వారిని ఆగస్టు 15న రిలీజ్ చేసింది.

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విచారణ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది సుప్రీంకోర్టు. కేసు తీవ్రత ఏంటో పట్టించుకోకుండా 11 మంది దోషులకు ఉపశమనం కల్పించడాన్ని ఆక్షేపించింది. క్షమాభిక్ష ప్రసాదించే ముందు దోషుల నేర తీవ్రతను పరిశీలించాలని స్పష్టం చేసింది. ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం మనసుపెట్టి ఆలోచించాల్సిందని అభిప్రాయపడింది.

మాల్దీవులు రాయబారికి భారత్ సమన్లు- లక్షద్వీప్ వ్యవహారంపై అసహనం!

దారితప్పిన కేంద్రమంత్రి పడవ- చీకట్లో రెండు గంటలు సరస్సులోనే

Last Updated : Jan 8, 2024, 4:01 PM IST

ABOUT THE AUTHOR

...view details