తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిల్కిస్ బానో దోషుల విడుదలపై సుప్రీం నోటీసులు, ఈడీ అధికారాలపై సమీక్ష

బిల్కిస్ బానో అత్యాచార దోషులకు క్షమాభిక్ష ప్రసాదించడంపై వివరణ ఇవ్వాలని కేంద్రం, గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. క్షమాభిక్ష పొందిన వ్యక్తులను కూడా కేసులో కక్షిదారులుగా చేర్చాలని ఆదేశించింది. మరోవైపు, ప్రధాని పంజాబ్ పర్యటనలో తలెత్తిన భద్రతా వైఫల్యానికి ఆ రోజు విధుల్లో ఉన్న ఎస్ఎస్పీ కారణమని సుప్రీంకోర్టు కమిటీ తేల్చింది.

Bilkis Bano case
Bilkis Bano case

By

Published : Aug 25, 2022, 3:24 PM IST

బిల్కిస్ బానోపై అత్యాచారం కేసులో దోషులను విడుదల చేసిన అంశంపై సుప్రీంకోర్టు కేంద్రం, గుజరాత్‌ ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. 11 మంది దోషులకు క్షమాభిక్ష పెట్టడంపై వివరణ ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్​వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఆగస్టు 15న బిల్కిస్‌ బానో అత్యాచారం కేసులో దోషులుగా ఉన్న 11 మందిని గుజ‌రాత్ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై దేశ‌వ్యాప్తంగా దుమారం రేగింది. గుజ‌రాత్ ప్రభుత్వ తీరును విప‌క్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. ఈ నేప‌థ్యంలో దాఖ‌లైన పిటిష‌న్లను విచారించిన సుప్రీంకోర్టు, దోషుల విడుద‌లపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని.. కేంద్ర ప్రభుత్వం, గుజ‌రాత్ సర్కార్‌ను కోరింది. అలాగే 'శిక్షా కాలం తగ్గింపు'ను పొందిన వ్యక్తుల్ని కూడా ఈ కేసులో కక్షిదారులుగా చేర్చాలని పిటిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Modi Punjab security:
మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో తలెత్తిన భద్రతా వైఫల్యం కేసులో ఫిరోజ్‌పుర్ ఎస్ఎస్పీ తన విధులను సక్రమంగా నిర్వర్తించలేదని సుప్రీంకోర్టు కమిటీ తేల్చింది. తగినంత స్థాయిలో బలగాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఎస్ఎస్పీ తన విధి నిర్వహణలో విఫలమయ్యారని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఫిరోజ్‌పుర్‌లో ఆందోళనకారులు అడ్డగించగా ఓ ఫ్లై ఓవర్‌పై ప్రధాని కాన్వాయ్ కొద్దిసేపు ఆగిపోయింది. ఈ ఘటన అనంతరం ప్రధాని మోదీ పంజాబ్‌లో ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండానే తిరుగు పయనమయ్యారు.

ప్రధాని భద్రతలో తలెత్తిన వైఫల్యాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. ఈ అంశాన్ని దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో సర్వోన్నత న్యాయస్థానం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. శాంతిభద్రతల నిర్వహణలో ఫిరోజ్‌పుర్ ఎస్ఎస్పీ విఫలమయ్యారన్న కమిటీ.. తగినంత స్థాయిలో బలగాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. సరిగా విధులు నిర్వర్తించలేకపోయారని పేర్కొంది. ప్రధాని ఆ మార్గంలో వస్తారని రెండు గంటల ముందే సమాచారం ఇచ్చినప్పటికీ.. శాంతిభద్రతలను సరిగా నిర్వహించలేకపోయారని స్పష్టం చేసింది. తగిన చర్యలకోసం ఐదుగురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్రానికి పంపుతామని సుప్రీంకోర్టు తెలిపింది.

ED powers supreme court:
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారాలను సమర్థిస్తూ మనీలాండరింగ్‌ నిరోధక చట్టంపై ఇచ్చిన తీర్పును పున:పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. నిందితులను అరెస్టు చేసే అధికారం ఈడీకి ఉండడం వంటి నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణకు సుప్రీంకోర్టు ఒప్పుకుంది. నిందితులకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేసు సమాచార నివేదికను ఇవ్వకపోవడం వంటి అంశాలను పునఃపరిశీలించాల్సి ఉందని సీజేఐ జస్టిస్‌ ఎన్​వీ రమణ పేర్కొన్నారు. ఈ అంశంపై అభిప్రాయం చెప్పాలని కేంద్రాన్ని కోరారు.

మనీలాండరింగ్‌ చట్టంలో భాగంగా ఈడీకి నిందితులను అరెస్టు చేయడం, విచారించడం, ఆస్తులను అటాచ్‌ చేయడం వంటి అధికారాలను సమర్థిస్తూ ఇచ్చిన తీర్పుపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశాలపై బహిరంగ విచారణ జరపాలని కోరారు. అందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

ABOUT THE AUTHOR

...view details