తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుజరాత్ ఎలక్షన్స్​.. మళ్లీ హాట్​టాపిక్​గా బిల్కిస్ బానో కేస్​ - గుజరాత్ ఎన్నికల సమయాన బిల్కిన్ బానో కేసు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో అత్యాచార ఘటన మరోసారి వార్తల్లోకెక్కింది. తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దోషులను ముందస్తుగా విడుదల చేయడం వల్ల బాధితురాలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో గుజరాత్ ఎన్నికల సమయాన ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది.

Bilkin Bano rape case during the Gujarat elections
సుప్రీంకోర్టు

By

Published : Nov 30, 2022, 5:29 PM IST

తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దోషులను గుజరాత్‌ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేయడంపై బాధితురాలు బిల్కిస్‌ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో దోషులకు రెమిషన్‌ పాలసీని అమలు చేసేందుకు గుజరాత్‌ ప్రభుత్వానికి గతంలో సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో ఆ ఉత్తర్వులను పునఃసమీక్షించాలని కోరుతూ తాజాగా బిల్కిస్‌ బానో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. దోషుల విడుదలపై గతంలో దాఖలైన పిటిషన్‌తో కలిపి దీన్ని విచారించొచ్చా?లేదా? అన్నది పరిశీలిస్తామని తెలిపింది.

గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిల్కిస్‌ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. బిల్కిస్‌ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008లో జీవిత ఖైదు విధించింది. బాంబే హైకోర్టు కూడా దీన్ని సమర్థించింది. దోషులు 15ఏళ్లు కారాగారంలో గడిపారు. ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేళ గుజరాత్‌ ప్రభుత్వం దోషులను విడుదల చేసింది. అత్యాచార దోషుల విడుదలను రాజకీయ పార్టీలతో పాటు అనేక సంఘాలు తీవ్రంగా ఖండించాయి. వీరి విడుదలను సవాల్‌ చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

ABOUT THE AUTHOR

...view details