Bilaspur advocate's record feat: చదువుకు వయసుతో సంబంధం లేదని చాటిచెబుతున్నారు ఓ న్యాయవాది. ఎనిమిది పదుల వయసులోనూ చదువుపై ఉన్న ఆయన మమకారాన్ని వదులుకోవట్లేదు ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే.. జ్యోతిషశాస్త్రంలో ఎంఏ చేస్తున్న ఆయన పేరు ఎస్వీ పురోహిత్. పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, హిందీ, ఇంగ్లీష్, మహాత్మ గాంధీ శాంతి పరిశోధనలు, అనువాదం- ఎడిటింగ్, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, డిప్లొమా ఇన్ సైబర్ లా, పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం వంటి సబ్జెక్ట్స్‌లో ఆయన మాస్టర్స్ చేసి అరుదైన ఘనత సాధించారు.
"1962వ సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేశా. ఆ తర్వాత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను. కానీ అప్పట్లో మా తండ్రి ఆదాయం చాలా తక్కువ. ఇద్దరు పిల్లలను చదివించే స్తోమత లేక ఒకరిని మాత్రమే చదివించేందుకు సిద్ధమయ్యారు. అందుకే మా తమ్ముడిని ఎంబీబీఎస్ చదివించారు. అప్పట్లో కుదరలేదు.. కానీ ఇప్పుడు నేను చివరిదాకా చదువును కొనసాగించాలనుకుంటున్నాను."
-ఎస్వీ పురోహిత్
ప్రస్తుతం 80ఏళ్ల వయసున్న ఎస్వీ పురోహిత్.. దేశంలోనే 14 సబ్జెక్టుల్లో ఎంఏ చేసిన ఏకైక వ్యక్తి తానేనని చెబుతున్నారు. ఇతర సబ్జెక్టుల్లో 24 డిప్లొమా పట్టాలు పొందినట్లు చెప్పారు. మరోవైపు.. తన తండ్రిపై ప్రశంసలు కురించారు ఆయన పెద్ద కుమారుడు సునీల్ పురోహిత్. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించడమే లక్ష్యంగా తన తండ్రి ముందుకు సాగుతున్నట్లు చెప్పాడు.