స్నేహితులతో కాసిన ఓ పందెం 25 ఏళ్ల యువకుడి నిండు ప్రాణాలను తీసింది. 'మోమోస్' ఛాలెంజ్‌లో భాగంగా ఏకంగా 150 మోమోస్‌ను తిన్నాడు బిహార్‌కు చెందిన ఓ యువకుడు. దీంతో ఆరోగ్యం క్షీణించడం వల్ల అతడు ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని అనుమానస్పదస్థితిలో గోపాల్‌గంజ్, సివాన్ జిల్లాల సరిహద్దుల్లోని రోడ్డు పక్కన స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహానికి పోస్ట్‌మార్టం పరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మృతుడు విపిన్ కుమార్(25)ను బిహార్ తూర్పు చంపారన్ జిల్లాలోని సిహోర్వా గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు పోలీసులు. విపిన్ కుమార్ సివాన్ జిల్లాలోని గ్యానీ మోర్ సమీపంలో ఓ మొబైల్ రిపేర్ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు గుర్తుతెలియని యువకులు షాపులో ఉన్న విపిన్‌ను పిలుచుకొని బయటకు తీసుకెళ్లారని.. ఎంతకీ అతడు తిరిగి రాలేదని మృతుడి తండ్రి చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు. మరోవైపు విపిన్ కుమార్‌ను తన స్నేహితులు కావాలనే విషం పెట్టి చంపారని అతడి తండ్రి విష్ణు మాంఝీ ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చాకే విపిన్ మరణానికి గల కారణాలు తెలుస్తాయని వెల్లడించారు.