బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ వచ్చిన సంపాదనతో ఆడీ కారు కొన్నాడు. కొవిడ్ లాక్డౌన్ నుంచి యూట్యూబ్‌లో కామెడీ వీడియోలు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నాడు. అలా వచ్చిన సంపాదనతోనే దాదాపు రూ. 50 లక్షల విలువైన ఆడీ కారు కొన్నాడు ఓ యువకుడు.
డెయిరీ మిల్క్‌తో మొదలైన ప్రయాణం..
ఔరంగాబాద్‌లోని జసోయా ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల హర్ష్ రాజ్‌పుత్ యూట్యూబ్‌లో కామెడీ వీడియోలు చేస్తూ నెలకు గరిష్ఠంగా రూ.8 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. 2020 కరోనా లాక్డౌన్ కాలంలో హర్ష్ యూట్యూబ్‌లో వీడియోలు చేయడం ప్రారంభించాడు. మొదటగా డెయిరీ మిల్క్‌పై ఓ కామెడీ వీడియోను చేశాడు. అది వైరల్‌గా మారినా సరే సంపాదన మాత్రం రాలేదని తెలిపాడు. ఆ తర్వాత నుంచి చేసిన అన్ని వీడియోలకు ప్రజాదరణతో పాటుగా.. సంపాదన రావడం మొదలైందని వెల్లడించాడు. ఆ వీడియోల్లో హర్ష్ రాజ్‌పుత్.. 'ధాకడ్' అనే ఓ న్యూస్ రిపోర్టర్ పేరుతో.. రకరకాల సమస్యలపై కామెడీ వీడియోలు చేసి నవ్విస్తాడు.
ప్రస్తుతం అతడి ఛానల్‌కు 33 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఒక్కో వీడియో దాదాపుగా 4 నుంచి 10 నిమిషాల నిడివి ఉంటుంది. ఈ కామెడీ వీడియోల ద్వారా నెలకు రూ.4 నుంచి 8 లక్షల వరకు ఆదాయం వస్తోందని హర్ష తెలిపాడు. హర్ష్ చేసిన ఓ వీడియోకి గరిష్ఠంగా 20 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ సంపాదనే కాకుండా బ్రాండ్ ప్రమోషన్ ద్వారా కూడా మరికొంత ఆదాయం పొందుతున్నట్లు హర్ష్ రాజ్‌పుత్ తెలిపాడు. దీంతో అతడి బ్యాంక్ బ్యాలెన్స్ భారీగా పెరిగింది. వీడియోల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఈ యూట్యూబ్ స్టార్ రూ. 50 లక్షల విలువైన ఆడీ కారును కొన్నాడు.
పశువుల దొడ్డిలో ఆడీ కారు
అయితే.. హర్ష్ తాను కొన్న ఆడీ కారును పశువుల దొడ్డిలో ఉంచుతున్నాడు. దీని పక్కనే ఓ ఆవును కూడా కట్టి ఉంచాడు. హర్ష్ గతంలో ఓ వీడియోలో మాట్లాడుతూ.. 'నా ఇంటి పరిస్థితి మీరు చూస్తున్నారు. మనం పుట్టినప్పుడు పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. కానీ భవిష్యత్ మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. మీరు ఏ స్థితిలో ఉన్నా సరే కలలు కనడం మానేయకండి. కలలు నిజమవుతాయి'. అని అన్నాడు. ప్రస్తుతం అది వైరల్‌గా మారుతుంది.
జంతుశాస్త్రంలో పీజీ పూర్తి చేసిన హర్ష్ రాజ్‌పుత్.. సివిల్స్ కోచింగ్ కోసం 2020లో దిల్లీకి వెళ్లాడు. అక్కడ ఓ థియేటర్లో పనిచేయడం ప్రారంభించాడు. అదే సమయంలో కరోనా మహమ్మారి రాకతో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఆ సమయంలో ఇంటికి చేరుకున్న హర్ష్ తన పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి స్టార్‌గా మారాడు. హర్ష్ రాజ్‌పుత్ తండ్రి ప్రస్తుతం హోంగార్డ్‌గా విధులు నిర్వరిస్తున్నాడు. యూట్యూబ్ స్టార్‌గా మారిన హర్ష్ ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.