తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇప్పటివరకు ఆమె ఓ కానిస్టేబుల్, ఇకపై డీఎస్​పీ

ఆమె ఓ సాధారణ కానిస్టేబుల్. విధి నిర్వహణ, కుటుంబ బాధ్యతలతో తీరికలేని జీవితం. అయినా, కలను సాకారం చేసుకునేందుకు ఏమాత్రం రాజీ పడకుండా కష్టపడింది. చివరకు అనుకున్నది సాధించింది. త్వరలోనే డీఎస్​పీగా బాధ్యతలు చేపట్టనుంది.

BEGUSURAI CONSTABLE BABLI KUMARI
BEGUSURAI CONSTABLE BABLI KUMARI

By

Published : Aug 25, 2022, 5:41 PM IST

బిహార్​లోని బెగుసరాయ్​ జిల్లాకు చెందిన బబ్లీ కుమారి అందరిలానే ఓ సాధారణ మహిళ. తల్లిదండ్రులకు పెద్ద కుమార్తె అయిన ఆమె ఇంటి పెద్దగా నిలవాలనుకుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించింది. 2015లో పోలీస్ కానిస్టేబుల్​ ఉద్యోగం సాధించింది. బిహర్​లోని ఖగారియా జిల్లాలో మొదటిసారి ఖాకీ దుస్తులు ధరించి విధుల్లో చేరింది. తర్వాత బెగుసరాయ్​కు బదిలీ అయింది. నెలనెలా జీతంతో ఆమె కుటుంబ ఆర్థిక స్థితి కాస్త మెరుగుపడింది.

అయినా.. అంతటితో ఆగిపోలేదు బబ్లీ కుమారి ప్రస్థానం. మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె కలగంది. ఇందుకోసం బిహార్ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ పరీక్షలు రాయలనుకుంది. పోలీస్ స్టేషన్​లో విధులు, ఇంటి పనులు.. ఇలా అన్నీ పూర్తయ్యాక మిగిలిన కాస్త సమయాన్నే సద్వినియోగం చేసుకుంది. ఏమాత్రం ఖాళీ దొరికినా పుస్తకం చేతబట్టేది. అలా బీపీఎస్​సీ పరీక్షలు రాసి మూడో ప్రయత్నంలో విజయం సాధించింది. ప్రస్తుతం బిహార్​లోని బెగుసరాయ్​ పోలీస్​స్టేషన్​లో కానిస్టేబుల్​గా పని చేస్తున్న బబ్లీ బీపీఎస్​సీలో క్వాలిఫై అయినందున రాజ్​గిర్​ ట్రైనింగ్​ సెంటర్​లో శిక్షణ తీసుకోనుంది. శిక్షణ కాలం ముగిసిన తర్వాత ఆమె బిహర్​ పోలీస్​ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్​గా బాధ్యతలు చేపట్టనుంది.

బబ్లీ కష్టానికి తగిన ఫలితం దక్కిందని ఆమె కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను బెగుసరాయ్ ఎస్​పీ యోగేంద్ర కుమార్ సన్మానించారు. కానిస్టేబుల్​గా పనిచేస్తూనే బీపీఎస్​సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమని కొనియాడారు. తనకు అండగా ఉండి ప్రోత్సహించిన కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులకు బబ్లీ కృతజ్ఞతలు తెలియజేసింది.

ABOUT THE AUTHOR

...view details