Virat Ramayan Mandir : ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. విరాట్ రామాయణ మందిరంగా పేర్కొంటున్న ఈ ఆలయం బిహార్ తూర్పు చంపారణ్ జిల్లా, కల్యాణ్‌పుర్ బ్లాక్‌లోని కైథవలియా గ్రామంలో నిర్మిస్తున్నారు. 2025 నాటికి ఈ ఆలయాన్ని పూర్తి చేయాలని సంకల్పించుకున్నారు. పట్నా మహావీర్ మందిర్ న్యాస్ సమితి అధినేత ఆచార్య కిశోర్ కునాల్ నేతృత్వంలో జరిగిన పూజాకార్యక్రమాలతో ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 11 గంటలకు పూజాకార్యక్రమాలు జరగ్గా.. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. జై శ్రీరామ్ నినాదాలతో నిర్మాణ ప్రాంగణాన్ని హోరెత్తించారు.
Virat Ramayan Temple : అయోధ్య రామ మందిరం మాదిరిగానే విరాట్ రామాయణ ఆలయం సైతం భక్తులను ఆకర్షిస్తుందని ఆచార్య కిశోర్ కునాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయోధ్య, జనక్‌పుర్ నగరాలకు మధ్యలో ఉండే ఈ ఆలయాన్ని సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంటున్నారు. అయోధ్య నుంచి జనక్‌పుర్ వెళ్లే భక్తులు మధ్యలో ఈ ఆలయాన్ని దర్శించుకుంటారని చెబుతున్నారు. ఆలయంతో పాటు అనేక ప్రాజెక్టులు ఇక్కడ చేపడతామని చెప్పారు. హెలిప్యాడ్, మ్యారేజ్ హాల్ వంటి నిర్మాణాలు చేపట్టనున్నట్లు వివరించారు. ముఖ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాట్ రామాయణ ఆలయాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
Bihar Virat Ramayan Mandir : ఈ ఆలయాన్ని ఇన్ఫ్రా సన్‌టెక్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్మిస్తోంది. ఆలయ నిర్మాణ పనుల కోసం 90 శాతం బిహార్ కూలీలనే నియమించుకుంటున్నట్లు కంపెనీ డైరెక్టర్ సర్వన్ ఝా తెలిపారు. ప్రస్తుతానికి రెండు యంత్రాలతో ఆలయ పనులు ప్రారంభించినట్లు చెప్పారు. 'త్వరలోనే మరిన్ని యంత్రాలను రంగంలోకి దించుతాం. వర్షకాలంలోనూ పనులు వేగంగా కొనసాగేలా చూస్తాం. నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా ఆలయాన్ని నిర్మిస్తాం. ఈరోజు పునాది పనులు ప్రారంభమయ్యాయి' అని సర్వన్ ఝా తెలిపారు.